వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుక్రెయిన్ యుద్ధం: రష్యా ఆయుధాలను కొనడం భారత్ తగ్గించుకుంటోందా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
రష్యా ఆయుధాలు

యుక్రెయిన్ మీద దాడి తర్వాత సుదీర్ఘకాలంగా సాగుతున్న భారత-రష్యా సంబంధాలు.. ముఖ్యంగా రక్షణ రంగంలో ఈ రెండు దేశాల మధ్య ఉన్న అనుబంధం చర్చనీయాంశంగా మారింది.

ఏప్రిల్‌లో అమెరికా పర్యటన సందర్భంగా పాశ్చాత్య దేశాలకు భారతదేశం 'గుడ్ ఫ్రెండ్' లా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అలాగని, భారతదేశం బలహీనంగా ఉండాలని కోరుకోవడం లేదని, తన భద్రతను చూసుకోవాల్సిన బాధ్యత ఉందని, రష్యా నుంచి సైనిక సామాగ్రిని తీసుకోవడం కొనసాగిస్తామని కూడా ఆమె తెలిపారు.

భారత్‌కు రష్యా ఆయుధాల అవసరం ఎంత?

ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ కొనుగోలుదారుల్లో ఇండియా ఒకటి. ఆయుధాల కొనుగోళ్లలో అనేక సంవత్సరాలుగా సోవియట్ రష్యాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది భారత్. పాకిస్తాన్, చైనాలతో శత్రుత్వం కొనసాగుతున్న క్రమంలో, 1990లలో సోనియట్ యూనియన్ పతనం తర్వాత కూడా రష్యాతో భారత్ కీలక భాగస్వామ్యాన్ని కొనసాగించింది.

1992 నుంచి భారత్ కొనుగోలు చేసిన సైనిక పరికరాలలో మూడింట రెండువంతులు రష్యా నుంచే వచ్చాయని 'సిప్రి' (స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) వెల్లడించింది.

భారత ప్రధానమైన ఆయుధ వ్యవస్థల్లో 85శాతం రష్యావేనని అమెరికాకు చెందిన రీసెర్చ్ గ్రూప్ స్టిమ్సన్ సెంటర్ వెల్లడించింది. ఈ ఆయుధాలలో ఫైటర్ జెట్‌లు, అణుశక్తితో నడిచే జలాంతర్గాములు, విమాన వాహక నౌకలు, ట్యాంకులు, క్షిపణులు ఉన్నాయి.

భారత యుద్ధ నౌక త్రిశూల్‌ను రష్యా నుంచి 2003లో కొన్నారు

భారతదేశం ఆయుధ కొనుగోళ్లలో వైవిధ్యాన్ని కోరుకుంటోందా?

గత దశాబ్ధ కాలంగా రష్యన్ ఆయుధాలపై ఆధారపడటాన్న భారత్ తగ్గించుకుంది. ఫ్రాన్స్, యూకే, ఇజ్రాయెల్, అమెరికాల నుంచి కూడా ఇప్పుడు భారత్ ఆయుధాలు కొంటోంది.

రష్యా ప్రధాన ఆయుధ సరఫరాదారు అయినా, 2021లో ఫ్రాన్స్, అమెరికా, ఇజ్రాయెల్‌ల నుంచి భారత్‌ కొనుగోలు చేసిన ఆయుధాల విలువ 2017 నాటికంటే రెట్టింపు ఉంటుందని 'సిప్రి' గణాంకాలు చూపిస్తున్నాయి.

ఫ్రాన్స్‌ నుంచి రాఫెల్‌ జెట్‌లు, మిరాజ్‌ యుద్ధ విమానాలు, స్కార్పీన్‌ జలాంతర్గాములను కొనుగోలు చేసింది భారత్. మోదీ ఇటీవల ఫ్రాన్స్ పర్యటించి, అధునాతన రక్షణ సాంకేతికతలో సహకారాన్ని మరింతగా పెంచుకునేందుకు ఇరుదేశాలు అంగీకరించినట్లు తెలిపారు.

అదే విధంగా, బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఏప్రిల్‌లో దిల్లీ పర్యటనకు వచ్చారు. యూకే, ఇండియాలు అధునాతన జెట్ ఫైటర్ టెక్నాలజీలో ఉమ్మడి సహకారాన్ని, రక్షణ, భద్రతా సంబంధాలను మరింతగా పెంచుకుంటామని ఈ సందర్భంగా ఇరుదేశాల నేతలు ప్రతిజ్ఞ చేశారు.

రష్యా, భారత్ సంయుక్త భాగస్వామ్యంతో బ్రహ్మోస్ మిసైళ్లు తయారయ్యాయి

భారతదేశం ఇజ్రాయెల్ నుంచి కూడా కొన్ని రక్షణ కొనుగోళ్లకు మొగ్గు చూపుతోంది. ఈ కింది సైనిక సామాగ్రిపై ప్రధానంగా కొనుగోళ్లకు అవకాశాలు ఉన్నాయి.

  • డ్రోన్ పరికరాలు
  • ఎయిర్‌బోర్న్ వార్నింగ్ సిస్టమ్స్
  • క్షిపణి నిరోధక రక్షణ
  • గైడెడ్ ఆయుధాలు

మరోవైపు 2018 నుంచి 2019 వరకు మధ్య కాలంలో అమెరికాతో కూడా భారత రక్షణ, సైనిక సంబంధాలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.

అమెరికా నుంచి జరుపుతున్న ప్రధాన కొనుగోళ్లలో లాంగ్ రేంజ్ సముద్ర గస్తీ విమానాలు, సి-130 విమానాలు, క్షిపణులు, డ్రోన్‌లు ఉన్నాయి. ఇటీవల స్పేస్ డిఫెన్స్, సైబర్ సెక్యూరిటీలో రెండు దేశాల మధ్య సహకారం గురించి పెంటగాన్ ప్రకటనలు చేసింది.

రష్యా తయారీ ఎస్-400 మిసైల్ సిస్టమ్

రష్యా ఆయుధాలను భారత్ వదిలేస్తుందా?

ఇటీవల మారుతూ వస్తున్న అంతర్జాతీయ రాజకీయాలు భారత్‌ను ఫ్రాన్స్, అమెరికా, ఇజ్రాయెల్ లాంటి దేశాలకు దగ్గర చేసింది. అయినప్పటికీ, యుక్రెయిన్‌ పై రష్యా దాడిని ఖండించిన దేశాల జాబితాలో భారత్ లేదు. తాము ఎవరి పక్షం వహించడానికి సిద్ధంగా లేమని భారత్ స్పష్టం చేసింది.

రష్యాపై ఆంక్షల ప్రభావం దృష్ట్యా, మాస్కోపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం కంటే భారత్‌కు వేరే మార్గం లేదని కొందరు రక్షణ నిపుణులు భావిస్తున్నారు.

2018లో భారతదేశం కొనుగోలు చేసిన రష్యా ఎస్-400 సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణి వ్యవస్థకు సంబంధించిన కీలక భాగాలతో ఇప్పుడు సమస్యలు ఉండవచ్చని, అందులో కొంత భాగాన్ని మాత్రమే రష్యా డెలివరీ చేసిందని స్టిమ్సన్ సెంటర్‌లో రక్షణ, భద్రతా విశ్లేషకుడు సమీర్ లాల్వానీ చెప్పారు.

"ఎస్-400 వ్యవస్థ మొత్తాన్ని డెలివరీ చేయడం ద్వారా రష్యా భారతదేశానికి తన ఒప్పందం నిబంధనలను నెరవేర్చలేకపోతుందని నమ్మడానికి బలమైన కారణం ఉంది" అని లాల్వానీ అన్నారు.

యుక్రెయిన్‌లో రష్యా ఎదుర్కొన్న నష్టాల కారణంగా భారతదేశ అవసరాలను తీర్చలేకపోవచ్చని కూడా ఆయన భావిస్తున్నారు. ''ఎందుకంటే రష్యా తన సొంత బలగాలను బలోపేతం చేయడంలో భాగంగా ఈ విడిభాగాలను తానే ఉపయోగించాల్సిన స్థితిలో ఉంది'' అని లాల్వానీ అన్నారు.

యుక్రెయిన్‌ లో రష్యా వార్ ఎక్విప్‌మెంట్ ఎదుర్కొన్న కొన్ని సమస్యలను భారత విధాన నిర్ణేతలు గమనిస్తున్నారని లాల్వాని చెప్పారు.

వ్లాదిమిర్ పుతిన్, నరేంద్ర మోదీ

రష్యా ఆయుధాలు లేకుండా భారత్ నెట్టుకురాగలదా?

ప్రస్తుతానికి అది అసంభవంగా కనిపిస్తోంది. గత ఏడాది అక్టోబర్‌లో అమెరికా కాంగ్రెస్ విడుదల చేసిన నివేదిక ప్రకారం "రష్యా సరఫరా చేసిన పరికరాలు లేకుండా భారత సైన్యం సమర్థవంతంగా పని చేయలేదు. రాబోయే కాలంలో కూడా రష్యా ఆయుధ వ్యవస్థలపై ఆధారపడటం కొనసాగిస్తుంది" అని ఈ నివేదిక పేర్కొంది.

రష్యా తన ఆయుధాలను ఆకర్షణీయమైన ధరలకు అందజేస్తుందని ఈ నివేదిక పేర్కొంది.

రష్యాల నుంచి భారత్ ఆయుధాల కొనుగోళ్లను కొనసాగిస్తుందని దిల్లీకి చెందిన ఏవియేషన్ అండ్ డిఫెన్స్ యూనివర్స్ ఎడిటర్ సంగీతా సక్సేనా అన్నారు. అయితే, భారతదేశం తన స్వదేశీ రక్షణ పరిశ్రమను అభివృద్ధి చేయాలని కోరుకుంటోందని, కొన్నిసార్లు ఇతర దేశాలతో ఉమ్మడి భాగస్వామ్యంతో పని చేస్తుందని కూడా ఆమె అన్నారు.

''మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాల కింద ఆయుధాల తయారీకి పెద్ద పీట వేయడానికి విదేశాల నుండి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ఇందులో భాగంగా ఉంటుంది'' అని సక్సేనా అన్నారు.

నాణ్యమైన, సరసమైన ధరల్లో ఎవరు ఆయుధాలు అందించినా భారత్ వాటిని కొనుగోలు చేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.

బీబీసీ ఫ్యాక్ట్‌చెక్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Ukraine war: Is India cutting back on Russian arms purchases
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X