బైజూస్ రవీంద్రన్‌కు యూఎస్ కోర్టు బిగ్ షాక్.. బిలియన్ డాలర్ల ఫైన్ !
అప్పుల సంక్షోభంలో కూరుకుపోయిన ఎడ్‌టెక్ సంస్థ బైజూస్‌కు మరి బిగ్ షాక్ తగిలింది. అమెరికాకు చెందిన రుణదాత గ్లాస్‌ట్రస్ట్ కంపెనీ ఎల్‌ఎల్‌సీ దాఖలు చేసిన పిటిషన్‌పై అమెరికా కోర్టు బైజూస్ ఆల్ఫాకు వ్యతిరేకంగా 'డిఫాల్ట్ జడ్జిమెంట్' (వాదనలకు ఆస్కారం లేకుండా) తీర్పు వెలువరించింది. అలానే బైజూస్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌కు వ్యక్తిగతంగా 1 బిలియన్ డాలర్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
ఈ మేరకు కోర్టు తీర్పులో, తమ ఆదేశాలను రవీంద్రన్ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం, పట్టించుకోకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డెలావేర్ దివాలా పరిష్కార కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. అసలే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రవీంద్రన్ కు ఇది కోలుకోలేని దెబ్బ అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కాగా బైజూస్ అంతర్జాతీయ రుణదాతల నుంచి నిధులు సేకరించే ఉద్దేశ్యంతో 2021లో బైజూస్ ఆల్ఫాను స్థాపించింది. దీని ద్వారా బైజూస్ ఆల్ఫా 1 బిలియన్ టర్మ్‌లోన్-బిని పొందింది. అయితే బైజూస్ ఆల్ఫా టర్మ్‌లోన్ నిబంధనలను ఉల్లంఘించిందని.. మొత్తం అప్పులో 533 మిలియన్ డాలర్లు అమెరికా నుంచి చట్టవిరుద్ధంగా తరలించారని రుణదాతలు ఆరోపించారు.
ఈ ఆరోపణల నేపథ్యంలో గ్లాస్‌ట్రస్ట్ డెలావేర్ కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు బైజూస్ ఆల్ఫాను స్వాధీనం చేసుకునేందుకు గ్లాస్‌ట్రస్ట్‌కు అనుమతించింది. అంతేకాకుండా, బైజూస్ ఆల్ఫా, గ్లాస్‌ట్రస్ట్‌కు సంబంధించిన 533 మిలియన్ డాలర్ల నిధుల లావాదేవీల వివరాలు సమర్పించాలని ఆదేశించింది.
ఈ 'డిస్కవరీ ఆదేశాల' గురించి తెలిసినప్పటికీ రవీంద్రన్ వాటిని పట్టించుకోలేదని కోర్టు పేర్కొంది. రవీంద్రన్ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన కోర్టు, బైజూస్ ఆల్ఫాకు సంబంధించి 533 మిలియన్ డాలర్లు మరియు క్యామ్‌షాఫ్ట్ హెడ్జ్‌ఫండ్ ఇంట్రెస్ట్‌కు సంబంధించిన 540.6 మిలియన్ డాలర్ల నిధులను వెంటనే చెల్లించాలని ఆదేశించింది.
ఆల్ఫా నిధులను ఎలా ఖర్చు చేసిందీ వెల్లడించి పూర్తి అకౌంట్ వివరాలు సమర్పించాలని కోర్టు బైజూస్‌ను ఆదేశించింది. ఈ ఆదేశాలను రవీంద్రన్ తోసిపుచ్చారు. దీనిపై అప్పీల్‌కు వెళ్తామని పేర్కొన్నారు. కోర్టులో తమ వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వలేదని బైజూస్ తరఫు న్యాయవాదులు తెలిపారు.












Click it and Unblock the Notifications