చైనాతో ఏం సాధించారు?: ట్రంప్ ఆధునిక నియంత: తొలి డిబేట్‌లోనే డామినేట్: కమలా హ్యారిస్ ఉగ్రరూపం
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా మరో డిబేట్ వాడివేడిగా సాగుతోంది. అమెరికా ఉపాధ్యక్ష పదవి కోసం ఎన్నికల బరిలో నిల్చున్న ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ మధ్య ఉటా స్టేట్‌లోని సాల్ట్ లేక్ సిటీలో ఈ డిబేట్‌ను ఏర్పాటు చేశారు. ఈ డిబేట్ సందర్భంగా మోడరేట్ సంధిస్తోన్న ప్రశ్నలకు మైక్ పెన్స్ సమాధానాలను ఇస్తోండగా.. దాన్ని తప్పు పడుతూ కనిపించారు కమలా హ్యారిస్. మైక్ పెన్స్‌పై పలు సందర్భాల్లో ఆమె ఎదురుదాడి చేశారు. చైనాతో ట్రేడ్ వార్, కరోనా వైరస్ నియంత్రణ, అమెరికా ఆర్థిక పరిస్థితులు.. ఇవన్నీ డిబేట్‌లో ప్రస్తావనకు వస్తున్నాయి.
Recommended Video
కమలా హ్యారిస్ పలు అంశాలపై మైక్ పెన్స్‌పై ఆధిపత్యాన్ని కనపర్చారు. ఈ డిబేట్‌లో చైనా అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆమె చెలరేగిపోయారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాల వల్ల లక్షలాది మంది అమెరికన్లు ఉపాధిని కోల్పోయారని, వీధిన పడ్డారని ఆరోపించారు. చైనాతో ట్రేడ్‌వార్‌ను ప్రారంభించిన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చివరికి.. ఏమి సాధించిందని ఆమె నిలదీశారు. ఈ ఒక్క ట్రేడ్ వార్ వల్ల అమెరికాలో ఉత్పాదక వ్యవస్థ దెబ్బతిన్నదని ఆరోపించారు. తయారీ రంగానికి చెందిన మూడు లక్షల మంది ఉపాధిని కోల్పోయారని ఆరోపించారు.

ట్రంప్.. నియంత్రత్వ పోకడలను అనుసరిస్తున్నారని విమర్శించారు. అమెరికాతో చిరకాలంగా సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూ వచ్చిన దేశాలన్నింటినీ దూరం చేశారని ఆరోపించారు. అమెరికాకు మిత్రులు లేకుండా చేశారని మండిపడ్డారు. దీనికి ధీటుగా మైక్ పెన్స్ సమాధానాలను ఇచ్చారు. అమెరికాను అగ్రరాజ్యంగా కొనసాగింపజేసేలా తమ ఎన్నికల ప్రణాళికను రూపొందించుకున్నామని అన్నారు. అమెరికాలో అమెరికన్లే అనే నినాదంతో పని చేస్తున్నామని చెప్పారు. యువతకు ఉపాధిని కల్పించడానికి, ఆర్థిక స్థితిగతులను మరింత బలోపేతం చేసే దిశగా తాము ప్రయత్నాలు సాగిస్తున్నామని, వాటిని కొనసాగిస్తామనే విశ్వాసం ఉందని మైక్ పెన్స్ తెలిపారు.












Click it and Unblock the Notifications