US Midterms 2026: అమెరికాలో పోలింగ్ మొదలు..! ట్రంప్ కు ముందస్తు షాక్ లు..!
అమెరికాలో మధ్యంతర ఎన్నికల పోలింగ్ ప్రక్రియ (US Midterms 2026) కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. అమెరికా కాంగ్రెస్ లోని ప్రతినిధుల సభలో 435 సీట్లు, సెనేట్ లో 35 సీట్లతో పాటు 36 రాష్ట్రాల గవర్నర్ పదవులకూ జరుగుతున్న ఈ ఎన్నికలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చావో రేవో అన్నట్లుగా మారాయి. దీంతో పలు మార్గాల్లో ఓటింగ్ ను ప్రభావితం చేసేందుకు ట్రంప్ తుది కంటా ప్రయత్నించారు. దీంతో న్యాయస్ధానాలు జోక్యం చేసుకుని ఆయనకు అడ్డుకట్ట వేశాయి. ఈ నేపథ్యంలో ఇవాళ అమెరికాలో ప్రత్యక్ష పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
అమెరికాలో జరుగుతున్న మధ్యంతర ఎన్నికల్లో ఆన్ లైన్, పోస్టల్ బ్యాలెట్ తో పాటు ప్రత్యక్ష పోలింగ్ కూడా నిర్వహిస్తారు. ఇందులో అమెరికా కాంగ్రెస్ పై పట్టు కోసం రిపబ్లికన్లు, డెమోక్రాట్లు హోరాహోరీగా తలపడుతున్నారు. అయితే ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్ లో ప్రతినిధుల సభలో మూడు ఓట్లు, సెనేట్ లో నాలుగు ఓట్లు సాధిస్తే చాలు మెజార్టీ అందుకునే పరిస్ధితుల్లో ఉన్న డెమోక్రాట్లు.. కచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉందని ఇప్పటికే పలు ప్రీపోల్స్ తేల్చిచెప్పేశాయి. దీంతో ట్రంప్ కు ముందస్తు షాక్ తప్పలేదు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా తన పార్టీ ఓటమి పాలవుతుందని గ్రహించిన ట్రంప్.. బెదిరింపులకు కూడా దిగారు. డెమోక్రాట్లు ఈ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పై పట్టు సాధించినా.. తనకున్న వీటో అధికారాలను ఉపయోగించి వారి నిర్ణయాల్ని అడ్డుకుంటానని ట్రంప్ ప్రకటించారు. తద్వారా మధ్యంతర ఎన్నికల్లో తన ఓటమిని ముందే అంగీకరించారు.

తాజా అంచనా ప్రకారం కీలకంగా మారిన ఏడు సెనేట్ సీట్లలో ఐదింటిలో, రెండు ప్రతినిధుల సభ సీట్లలో , అలాగే జార్జియా గవర్నర్ రేసులో కూడా ట్రంప్ రిపబ్లికన్ పార్టీపై డెమొక్రాట్లు ఆధిక్యంలో ఉండే అవకాశం ఉందని వెల్లడైంది. ఇందులో 10 కీలక రేసులలో ఎనిమిదింటిలో డెమొక్రాట్లు ఆధిక్యంలో ఉండగా, మిగిలిన రెండింటిలో రిపబ్లికన్లకు అనుకూలంగా ఉంది. సెనేట్ రేసులలో, టెక్సాస్, ఒహాయో, నార్త్ కరోలినా, జార్జియా, మిచిగాన్లలో డెమొక్రాటిక్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉంటారని అంచనా వేయగా, అయోవా, ఫ్లోరిడాలలో రిపబ్లికన్లు ఆధిక్యంలో ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవిని తలకిందులు చేయగలవని భావిస్తున్న ఈ మధ్యంతర ఎన్నికల పోలింగ్ ఇవాళ అమెరికా తూర్పు తీరంలో ప్రారంభమైంది. ఈ ఎన్నికలలో డెమోక్రాట్లు కాంగ్రెస్‌పై నియంత్రణ సాధించి, ఆయన కార్యనిర్వాహక అధికారాలను గణనీయంగా తగ్గించాలని చూస్తున్నారు. ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న ధరలు, ఇరాన్ పై యుద్దం వంటి వివాదాల కారణంగా ట్రంప్ ఆదరణ తగ్గిపోయింది. ఇదే అదనుగా డెమోక్రాట్లు ప్రతినిధుల సభపై నియంత్రణ సాధించి, సెనేట్ను కూడా చేజిక్కించుకునే అవకాశం ఉందని పలు సర్వేలు అంచనా వేస్తున్నాయి.














Click it and Unblock the Notifications
