సీట్లోనే ట్రంప్ - అయినా అన్నీ బ్రేకులే ?- అమెరికా మధ్యంతర ఎన్నికల లెక్కేంటి?
ఈ వారంలో జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికలపై (US Midterm Elections) ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అయితే ఇతర దేశాల ఎన్నికల తరహాలో అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాలు అధ్యక్షుడిని పదవీచ్యుతుడిని చేయలేవు. దానికి బదులు చేయాల్సిందంతా చేస్తాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా వీటికి అంత ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా దేశీయ, అంతర్జాతీయ వ్యవహారాల్లో ట్రంప్ ప్రదర్శిస్తున్న దూకుడుకు అడ్డుకట్ట వేసే సామర్ధ్యం వీటికి ఉంది. దీంతో ఈ ఎన్నికలు, వాటి ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి.
రెండేళ్ల క్రితం అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కు మరో రెండేళ్ల పదవీకాలం మిగిలి ఉంది. ఈ రెండేళ్లలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకోవాలంటే సంప్రదించాల్సిన అమెరికా కాంగ్రెస్ (ప్రతినిధుల సభ, సెనేట్) పై ఎవరి పట్టు ఉండబోతోందో ఈ ఎన్నికలు తేల్చబోతున్నాయి. ఇలా కాంగ్రెస్‌పై పట్టు సాధించే పార్టీకి చట్టాల రూపకల్పనలోనూ, బడ్జెట్ ఆమోదంలోనూ, ప్రభుత్వ విధానాల అమలులోనూ కీలక పాత్ర లభిస్తుంది. దీంతో కాంగ్రెస్ ఆమోదం లేకుండా ట్రంప్ ముందడుగు వేయలేని పరిస్ధితి ఎదురవుతుంది. ఒకవేళ ఈ ఎన్నికల్లో ట్రంప్ సొంత పార్టీ రిపబ్లికన్లు కాంగ్రెస్ పై పట్టు సాధిస్తే ఇబ్బంది లేదు, డెమోక్రాట్లు గెలిస్తే కష్టాలు మొదలైనట్లే. కానీ అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలతో అధ్యక్షుడిని తొలగించే అవకాశం లేదు. అంటే ట్రంప్ పదవి సేఫ్ అన్నమాట. కానీ ఆయన అధికారాలను, నిర్ణయాలను ఎంతవరకు అమలును మాత్రం ఇవి నిర్దేశిస్తాయి.

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ఓటింగ్ ఉండదు. కానీ కాంగ్రెస్‌లోని రెండు సభలకు మాత్రం ఎన్నికలు జరుగుతాయి. వీటితో పాటు ఆయా రాష్ట్రాల్లో గవర్నర్లు, రాష్ట్ర శాసనసభ సభ్యులు, కొన్ని ప్రాంతాల్లో న్యాయమూర్తుల ఎన్నికలూ జరుగుతాయి. కాంగ్రెస్ లోని ప్రతినిధుల సభలో 435 మంది రెండేళ్ల పదవీకాలంతో ఎన్నికవుతారు. మరో సభ సెనేట్ లో మొత్తం 100 మంది సభ్యులు ఆరేళ్ల పదవీకాలంతో ఎన్నికవుతారు. సెనేట్ కు మాత్రం ప్రతీ రెండేళ్లకోసారి సుమారు మూడింటి ఒక వంతు స్ధానాలకు ఎన్నికలుంటాయి. అమెరికా ప్రభుత్వంలో అధ్యక్షుడి చేతుల్లోని కార్యనిర్వాహక వ్యవస్థపై కాంగ్రెస్ నియంత్రణ, పర్యవేక్షణ అధికారాలను కలిగి ఉంటుంది. అందువల్ల కాంగ్రెస్‌లో మెజారిటీ మారితే అధ్యక్షుడి పాలనపై ప్రభావం పడుతుంది.

అందుకే ట్రంప్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ లో మెజార్టీ కోల్పోతే కొత్త చట్టాలను ఆమోదించుకోవడం కష్టమవుతుంది. ప్రభుత్వ బడ్జెట్ ఆమోదానికి ప్రతిపక్షాల మద్దతు అవసరమవుతుంది. అధ్యక్షుడి కీలక నియామకాలకు సెనేట్ ఆమోదం కష్టమవుతుంది.ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలపై కాంగ్రెస్ విచారణలు జరుగుతాయి. అధ్యక్షుడి ఎన్నికల హామీల అమలుకు ఆటంకాలు తప్పవు. అందుకే మధ్యంతర ఎన్నికలను ప్రస్తుత అధ్యక్షుడి ప్రజాదరణకు ఒక పరీక్షగా పరిగణిస్తారు. ఈసారి మధ్యంతర ఎన్నికల్లో సెనేట్‌లోని 100 స్థానాల్లో సాధారణ ఎన్నికల చక్రం ప్రకారం 33 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఫ్లోరిడా, ఒహియో రాష్ట్రాల్లో ప్రత్యేక ఎన్నికలు కూడా ఉండటంతో మొత్తం 35 సెనేట్ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. అంటే సెనేట్ లోని 35 సీట్లు, ప్రతినిధుల సభలో 435 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. వీటికి ఓటర్లు ప్రత్యక్ష పోలింగ్, ముందస్తు ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేయవచ్చు.















Click it and Unblock the Notifications
