అమెరికాలో తనిఖీల్లేవ్: జాబితాలో సచిన్, అంబానీలు, షారుఖ్
వాషింగ్టన్: అమెరికా వెళ్లిన వీవీఐపీలు అక్కడి విమానాశ్రయాల్లో తనిఖీలు పేరిట ఇక గంటలతరబడి నిల్చోవాల్సిన అవసరం లేదు. ఎంపిక చేసిన భారతీయ సెలబ్రిటీలు, వీఐపీలు అమెరికాలోని 42 విమానాశ్రయాల్లో తనిఖీలు లేకుండా, లగేజ్ చెకింగ్‌ల వద్ద నిరీక్షించాల్సిన అవసరం లేకుండా ఆ దేశంలోకి అడుగుపెట్టే వెసులుబాటుని కల్పించనుంది.
గతేడాది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా వెళ్లినప్పుడు 'గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్' కింద అమెరికా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు అదే 'గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్' కింద ఈ వెసులుబాటును కల్పిస్తోంది. ఇప్పుడు దాన్ని అమలు చేయడంలో భాగంగా అమెరికా అధికారులు ఇటీవల భారత్‌కు వచ్చి చర్చలు జరిపారు.
ఈ పోగ్రామ్ కింద భారత్ ముందుగా 2000 మంది వీవీఐపీల జాబితాను రూపొందిస్తుంది. ఈ జాబితాలో మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానమంత్రులతో పాటు బాలీవుడ్ హీరోలు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, పారిశ్రామికవేత్తలైన అంబానీ సోదరులు, గౌతం అదానీ, సచిన్ టెండూల్కర్‌తో పాటు, ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ లాంటి వారి పేర్లు ఉన్నాయి.

ఈ జాబితా కేవలం రెండువేల మందికి పరిమితం కాదని, సెలబ్రిటీలు, వీవీఐపీల జాబితా ముగిశాక, దరఖాస్తు చేసుకున్న సామాన్య పౌరులకు కూడా ఈ సదుపాయాన్ని కల్పిస్తామని అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఈ జాబితాకు ఎంపిక చేసే వారికి ఎవరికీ కూడా నేర చరిత్ర ఉండకూడదు, ఎలాంటి ఆర్థిక నేరాలకు పాల్పడకూడదని తెలిపాయి.
'ఎంట్రీ ఫ్రీ' సౌకర్యం కోసం దరఖాస్తు చేసుకున్న వారందరి బ్యాగ్రౌండ్‌ను భద్రతా సిబ్బంది ముందుగానే తనిఖీ చేస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ జాబితాలో ఉన్న వీఐపీలు లగేజిను కూడా అమెరికా విమానాశ్రయాల సిబ్బంది తనిఖీ చేయరని, అయితే వారి దేశంలో అడుగుపెట్టినట్లు రూఢీ చేసుకునేందుకు ఎలక్ట్రానిక్ పద్ధతిలో వేలు ముద్రలు తీసుకుంటారని ఆ వర్గాలు వివరించాయి.
అమెరికా 'గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్' కింద భారత్‌తో పాటు నెదర్లాండ్స్, పనామా, దక్షిణ కొరియా, జర్మనీ, పెరు, మెక్సికో, కెనడా దేశాలకు ఈ అవకాశం కల్పిస్తోంది. అమెరికా చేపట్టిన ఈ 'గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్' కింద ప్రపంచ వ్యాప్తంగా 1.8 మిలియన్ ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications