మరోసారి టారిఫ్ బాంబు పేల్చిన ట్రంప్.. ఈసారి వాటిపైన !!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ బాంబ్ పేల్చారు. "అమెరికా ఫస్ట్" అజెండా కింద భారీ టారిఫ్‌లను ప్రకటించారు. ప్రత్యేకంగా కలప (లంబర్), టింబర్ ఉత్పత్తులు, కిచెన్ క్యాబినెట్‌లు, బాత్రూమ్ వానిటీలు, అప్‌హోల్‌స్టర్డ్ ఫర్నిచర్‌లపై కొత్త సుంకాలు విధించనున్నట్లు వైట్‌హౌస్ వెల్లడించింది. ఈ నిర్ణయం దేశీయ కలప ఉత్పత్తిని ప్రోత్సహించి.. అమెరికా పారిశ్రామికతను పెంచడమే లక్ష్యంగా తీసుకున్న నిర్ణయమని ట్రంప్ తెలిపారు.
కొత్త సుంకాల వివరాలు..
కొత్త నిబంధనల ప్రకారం సాఫ్ట్‌వుడ్ లంబర్, టింబర్ దిగుమతులపై 10 శాతం సుంకం.. కిచెన్ క్యాబినెట్‌లు, వానిటీలు, అప్‌హోల్‌స్టర్డ్ ఫర్నిచర్‌లపై 25 శాతం సుంకం అమల్లోకి రానున్నాయి. ఇవి అక్టోబర్ 14, 2025 నుండి అమలులోకి వస్తాయి. అయితే ట్రంప్ ఇటీవల ట్రూత్ సోషల్‌లో చేసిన ప్రకటనలో వచ్చే ఏడాది జనవరి 1 నుండి ఈ రేట్లు మరింత పెరగవచ్చని సూచించారు. క్యాబినెట్‌లపై 50 శాతం, అప్‌హోల్‌స్టర్డ్ ఫర్నిచర్‌పై 30 శాతం వరకు అదనపు సుంకాలను విధించాలనే ఆలోచన ఉందని ఆయన వెల్లడించారు. అయితే ఫర్నిచర్ ధరలు ఇప్పటికే పెరుగుతున్న పరిస్థితిలో ఈ నిర్ణయం వినియోగదారులపై మరింత భారాన్ని మోపనుంది.

2025 ఆగస్టు నాటికి, గత సంవత్సరం ఇదే సమయంలో పోలిస్తే ఫర్నిచర్ ధరలు 4.7 శాతం పెరిగాయని బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ సమాచారం చెబుతోంది. ముఖ్యంగా లివింగ్ రూం, డైనింగ్ రూంల కోసం ఉద్దేశించిన ఫర్నిచర్ ధరలు గత 12 నెలల్లో 9.5 శాతం వరకు ఎగసిపడ్డాయి. ఇప్పుడు కొత్త టారిఫ్‌లు అమల్లోకి వస్తే ధరలు మరింత ఎగబాకే అవకాశముంది. వైట్‌హౌస్ ఈ చర్యలకు జాతీయ భద్రత కోణాన్ని కూడా జోడించింది. కలప ఉత్పత్తులు కేవలం వాణిజ్య అవసరాలకే కాకుండా రక్షణ రంగ కార్యకలాపాలకు కీలకమని వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ నివేదికలో పేర్కొన్నారు. ఆయన వివరించిన ప్రకారం, కలప యుద్ధ విభాగం మౌలిక వసతుల నిర్మాణంలో, మందుగుండు సామగ్రి రవాణాలో, క్షిపణి రక్షణ వ్యవస్థల్లో, అణు పునఃప్రవేశ వాహనాల థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్‌లలో కూడా వినియోగించబడుతుందన్నారు.
అంతర్జాతీయ ప్రతిస్పందనలు..
చైనా, వియత్నాం వంటి దేశాలు అమెరికాకు ప్రధానంగా ఫర్నిచర్ సరఫరా చేస్తున్నాయి. 2024లో ఈ రెండు దేశాలు మాత్రమే 12 బిలియన్ డాలర్ల విలువైన ఫర్నిచర్‌ను అమెరికాకు ఎగుమతి చేశాయి. ఇప్పుడు ఈ కొత్త టారిఫ్‌లతో ఆ దేశాలపై నేరుగా ప్రభావం చూపనుంది. చైనా ఇప్పటికే స్పందిస్తూ, టారిఫ్ యుద్ధంలో ఎవరూ గెలవరని విమర్శించింది. ట్రంప్ ప్రకటనలతో అమెరికా ఫర్నిచర్ కంపెనీల షేర్ల మార్కెట్‌లో తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది.
ఇక ఇప్పటికే అమెరికా వెలుపల నిర్మించే సినిమాలపై 100 శాతం అదనపు సుంకాలను విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇది భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది. అంతే కాకుండా H1 B వీసాల విషయంలో సైతం ట్రంప్ వైఖరి పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications