పుతిన్‌కు డొనాల్డ్ ట్రంప్ ఫోన్.. ఏం మాట్లాడుకున్నారంటే?
ఉక్రెయిన్‌తో యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ అంశంపై ఆయన కీలకంగా చర్చించారు. ఈ మేరకు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కాల్పుల విరమణపై తమ బృందంతో చర్చలు జరిపేందుకు పుతిన్ అంగీకరించినట్లు ట్రంప్ తెలిపారు.
అంతేగాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాలర్ తదితర అంశాలపై పుతిన్‌తో మాట్లాడినట్లు ట్రంప్ వెల్లడించారు. ఇరు దేశాల బలాబలాల అంశం కూడా చర్చకు వచ్చిందన్నారు. కలిసి పనిచేయడం వల్ల ఏదో ఒక రోజు గొప్ప లబ్ధి చేకూరుతుందని చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఇప్పటికే చాలా నష్టం జరిగిందని పేర్కొన్నారు.

యుద్ధంలో లక్షల మంది ప్రాణ నష్టాన్ని అరికట్టాలని అంగీకారానికి వచ్చినట్లు ట్రంప్ తెలిపారు. తక్షణమే చర్చలు మొదలు పెట్టేందుకు ఇరువురం అంగీకరించినట్లు చెప్పారు. కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు ట్రంప్ తెలిపారు. కామన్ సెన్స్ నినాదాన్ని తనతోపాటు పుటిన్ కూడా గట్టిగా నమ్ముతున్నారని చెప్పారు.
ఒకరి దేశానికి మరొకరు సందర్శనకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో సంభాషించిన అనంతరం పేర్కొన్నారు. చర్చలకు పుతిన్ చూపిన ఓపెన్ స్పీచ్‌ను ట్రంప్ ప్రశంసించారు. అంతేగాక, రష్యాలో నిర్బంధంలో ఉన్న అమెరికన్ పౌరుడు మార్క్ ఫోగెల్ విడుదలకు సహకరించినందుకు రష్యా అధ్యక్షుడికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని సంప్రదించి తమ చర్చల గురించి తెలియజేయాలనే తన ఉద్దేశాన్ని ట్రంప్ వెల్లడించారు. విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, సీఏఏ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్, జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్ట్జ్, రాయబారి స్టీవ్ విట్‌కాఫ్‌లతో కూడిన అమెరికా ప్రతినిధి బృందం చర్చలకు నాయకత్వం వహిస్తుందని ఆయన ప్రకటించారు. ఈ ప్రక్రియ రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య శాంతియుత పరిస్థితులు నెలకునేలా చేస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications