ఎన్నికల వేళ.. మోదీకి బైడెన్ ఫోన్ కాల్: మంచి పని చేశారు
Joe Biden and PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఇటీవలే ఉక్రెయిన్‌లో పర్యటించారు. రాజధాని కీవ్‌లో ఆ దేశాధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక- రక్షణ ఒప్పందాలపై చర్చించారు. సుదీర్ఘకాలంగా రష్యాతో యుద్ధాన్ని కొనసాగిస్తోన్న నేపథ్యంలో శాంతి చర్చలను ప్రతిపాదించారు. చర్చల వల్ల అన్ని సమస్యలను పరిష్కరించుకోవచ్చని సూచించారు.
ఈ రెండు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొనేలా, కాల్పుల విరమణ ఒప్పందాలు కుదిరేలా చర్చలు సాగించారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో, భద్రతమండలి భేటీలో నిర్వహించిన ఓటింగ్‌లో భారత్ అనుసరించిన విధానాల గురించీ గుర్తుచేశారు ప్రధాని మోదీ.

ఒక భారత ప్రధాని ఉక్రెయిన్‌లో పర్యటిస్తోండటం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 1991లో సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి ప్రత్యేక దేశంగా ఆవిర్భవించింది ఉక్రెయిన్. అప్పటి నుంచి ఇప్పటివరకు భారత్‌కు చెందిన ఏ ప్రధాని కూడా ఆ దేశానికి వెళ్లలేదు. ఇప్పుడు అక్కడికి వెళ్లిన తొలి ప్రధానిగా రికార్డు నెలకొల్పారు మోదీ.
సుదీర్ఘకాలంగా రష్యాతో యుద్ధాన్ని కొనసాగిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మోదీ.. ఉక్రెయిన్‌లో అడుగుపెట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పలు దేశాలు స్పందించాయి. ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటనపై సానుకూలంగా స్పందించాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని నివారించడానికి మోదీ వేసిన ఓ గొప్ప అడుగుగా అభివర్ణించాయి.
తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఈ అంశంపై మాట్లాడారు. ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. ఆయనను అభినందించారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య శాంతియుత వాతావరణం ఏర్పడేలా, కాల్పుల విరమణ ఒప్పందాలు కుదిరేలా ముందడుగు దేశారని ప్రశంసించారు.
జో బైడెన్- ప్రధాని మోదీ మధ్య సాగిన టెలిఫోన్ సంభాషణకు సంబంధించిన వివరాలతో కూడిన ఓ ప్రకటనను వైట్ హౌస్ విడుదల చేసింది. ఇదే విషయాన్ని ప్రధాని మోదీ తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో ద్వారా వెల్లడించారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, బంగ్లాదేశ్ పరిణామాలపై చర్చించినట్లు చెప్పారు.
అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఈ రెండు దేశాలు కూడా కాల్పుల విరమణకు, శాంతియుత చర్చలకు ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ ఇద్దరు నేతలు అభిప్రాయపడినట్లు వైట్ హౌస్ తెలిపింది.
అదే సమయంలో- భారత్ పొరుగునే ఉన్న బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, హింసాత్మక వాతావరణం, హిందువులపై దాడుల అంశం కూడా బైడెన్- మోదీ మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు వైట్ హౌస్ పేర్కొంది. సత్వరమే అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి పూర్తి మద్దతు ఇస్తామని బైడెన్ హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications