Panama Canal: పనామా కాలువపై చైనా నియంత్రణను తగ్గించాలి.. అమెరికా హెచ్చరిక
Panama Canal: పనామా కాలువపై చైనా ప్రభావం, నియంత్రణను తగ్గించడానికి అత్యవసర మార్పులు చేయాలని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పనామాను హెచ్చరించారు. ఆదివారం(ఫిబ్రవరి 2) పనామాకు చేరుకున్న రూబియో.. పనామా వెంటనే చర్య తీసుకోవాలని లేకుంటే అమెరికా తన హక్కులను కాపాడుకోవడానికి చర్యలు తీసుకుంటుందని అన్నారు. అమెరికా విదేశాంగ కార్యదర్శిగా రూబియో చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇది. పనామా కాలువ ఆపరేషన్ నియంత్రణను అమెరికాకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో సహా, పొరుగు దేశాలు, మిత్రదేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి పెంచుతున్న సమయంలో ఆయన పర్యటన జరుగుతోంది.
పనామా అధ్యక్షుడితో అమెరికా విదేశాంగ కార్యదర్శి భేటీ
ఆదివారం పనామా నగరంలో పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినోతో జరిగిన సమావేశం తర్వాత అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఈ హెచ్చరికను చేశారు. ఇద్దరు నాయకుల మధ్య సమావేశం రెండు గంటల పాటు కొనసాగింది. పనామా కాలువ విషయంలో చైనా జోక్యాన్ని, నియంత్రణను అడ్డుకోవాలని లేదంటే అమెరికా చర్యలు తీసుకుందని రూబియో హెచ్చరించారు. అనంతరం పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో మాట్లాడుతూ.. అమెరికా దురాక్రమణకు తాము భయపడబోమని వెల్లడించారు. చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. చైనా ప్రభావం గురించి ట్రంప్ ఆందోళనలను పరిష్కరించడానికి అమెరికాతో సాంకేతిక స్థాయి చర్యలను ప్రతిపాదించినట్లు ములినో చెప్పారు. ఇంతలో, కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ ప్రతిజ్ఞ చేసిన తరువాత పనామాలో నిరసనలు చెలరేగాయి. శుక్రవారం, పనామా నగరంలో నిరసనకారులు ట్రంప్ మరియు రూబియో దిష్టిబొమ్మలను దహనం చేశారు.

పనామా కాలువపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పనామా కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఎప్పట్నుంచో హెచ్చరిస్తున్న ట్రంప్.. త్వరలోనే కీలక పరిణామాలు ఉంటాయన్నారు. పనామా కాలువను చైనా పరోక్షంగా నిర్వహిస్తోందని.. దాన్ని మేము చైనాకు ఇవ్వలేదని ట్రంప్ పేర్కొన్నారు. ఒప్పందాన్ని పనామా ఉల్లంఘిస్తోందన్నారు. అందుకే పనామా కాలువను తిరిగి తీసుకోవాలనుకుంటున్నామని.. దీనికి సంబంధించి శక్తివంతమైన చర్య ఉండబోతోందని ట్రంప్ మీడియాతో పేర్కొన్నారు. దీనికి బలగాల అవసరం ఉండకపోవచ్చని ఆయన చెప్పారు. ట్రంప్ హెచ్చరిక నేపథ్యంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పనామా పర్యటన జరిగింది. రూబియో పర్యటన వలసలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడం వంటి ఉమ్మడి ఆసక్తులపై దృష్టి సారిస్తుందని తాను ఆశిస్తున్నానని ములినో అన్నారు. కాలువ యాజమాన్యంపై ఎటువంటి చర్చలకు ములినో నిరాకరించినప్పటికీ, హాంగ్ కాంగ్‌కు చెందిన హచిసన్ పోర్ట్స్ కంపెనీ నుండి రెండు వైపులా కాలువ నిర్వహణను స్వాధీనం చేసుకునే ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి పనామా సిద్ధంగా ఉండవచ్చని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు నుంచి తాము వైదొలుగుతున్నట్లు పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో ప్రకటించారు. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ములినో ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో చేరేందుకు 2017లో చైనాతో చేసుకున్న ఒప్పందాన్ని తాము పునరుద్ధరించబోమని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications