పసిఫిక్ మహా సముద్రంలో భారీ భూకంపం: తీరంలో అలజడి..!!
Vanuatu Earthquake: పసిఫిక్ మహాసముద్రం రీజియన్ లోని వనౌటులో పెను భూకంపం సంభవించింది. చిన్న ద్వీపదేశం ఇది. ఇక్కడి తీరప్రాంతంలో 6.0 తీవ్రతతో భూమి కంపించింది. దీని తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. ఆ తరువాత దాన్ని ఉపసంహరించుకున్నారు. భూకంప తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో తీర ప్రాంతాలు పోటెత్తాయి. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి.
తొలుత సునామీ హెచ్చరికలు జారీ కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. తీర ప్రాంతం మొత్తాన్నీ ఖాళీ చేయించారు. వనౌటు రాజధాని పోర్ట్ విలా బీచ్‌లను తాత్కాలికంగా మూసివేశారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:28 నిమిషాలకు భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే తెలిపింది. పోర్ట్‌విలా, కోరల్ సీ కి దక్షిణ దిశగా 74, లాటా, సొలొమన్ ఐలండ్స్ కు 197 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహా సముద్రంలో భూమి ప్రకంపించింది.

ఉపరితలం నుంచి ఆరు కిలోమీటర్ల లోతున టెక్టోనిక్ ప్లేట్‌లో సంభవించిన పెను కదలికల వల్ల ఈ భూకంపం సంభవించినట్లు యూఎస్‌జీఎస్ పేర్కొంది. భూకంపం సంభవించిన వెంటనే హవాయ్‌లోని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ అప్రమత్తం అయింది. 6.1 తీవ్రతతో కూడుకున్న ప్రకంపనలు కావడం వల్ల సునామీ అలర్ట్ ను జారీ చేసింది. ఆ తరువాత దాన్ని ఉపసంహరించుకుంది. ఈ భూకంప ప్రభావం కోరల్ సీ, ఆస్ట్రేలియా తీరంపైనా కనిపించింది.
భూకంప తీవ్రత వల్ల వనువాటు తీర ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చింది. తీరంలో అలలు సాధారణ స్థాయి కంటే మీటర్ ఎత్తుకు ఎగిసిపడ్డాయి. పోర్ట్‌విలాలో కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి. యూఎస్‌జీఎస్ ప్రాథమిక అంచనాల ప్రకారం సోలొమన్ దీవులలో 21,300 మంది, వనౌటులో 8,920 మందిపై భూకంప ప్రభావానికి లోనయ్యారు. ఆయా ప్రాంతాల ప్రజలు భయంకపితులయ్యారు. రోడ్ల మీదికి పరుగులు తీశారు.
ఇది షాలో ఎర్త్ క్వెక్. అంటే లోతు తక్కువగా ఉండే భూప్రకంపనలు. సాధారణ భూకంపాల కంటే షాలో భూకంపాలు ఎక్కువ ప్రమాదకరమైనవి. లోతు తక్కువ కావడం వల్ల భూకంప తరంగాలు ఉపరితలానికి వేగంగా ప్రయాణించగలుగుతాయి. దీని ప్రకంపనలు బలంగా భూఉపరితలాన్ని తాకుతాయి. భారీ నిర్మాణాలకు సైతం తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అలాగే ప్రాణనష్టం కూడా అధికంగా ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో.
వనౌటుకు పొరుగునే ఉన్న న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల తీర ప్రాంతాలు కూడ అలజడికి గురయ్యాయి. వనౌటు.. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉంది. ఇక్కడ టెక్టోనిక్ ప్లేట్లు తరచూ ఢీకొంటుంటాయి. భూకంపాలు సంభవిస్తుంటాయి. క్రియాశీలక అగ్నిపర్వతాలు అధికంగా ఉన్నాయి ఇక్కడ. 2024 డిసెంబర్ లో 7.3 తీవ్రతతో వనువాటులో భూమి ప్రకంపించింది. అప్పట్లో 14 మంది ప్రాణాలను బలితీసుకుంది. 2,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు.












Click it and Unblock the Notifications