వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో నీటి సంక్షోభం: ‘ఇక్కడ కుళాయి నీళ్లు తాగలేం, వాటితో స్నానం చేయలేం, పళ్లు కూడా తోముకోలేం’

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మార్షల్

అమెరికాలోని మిసిసిపీ రాష్ట్రంలో పశ్చిమ జాక్సన్ ప్రాంతంలో మార్షల్ నివసిస్తుంటారు. ఈ ప్రాంతంలో ఎక్కువమంది నల్లవారు, పేదలు జీవిస్తుంటారు.

ఈ నీటిని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదికాదని హెచ్చరికలు ఉన్నప్పటికీ, ట్యాప్‌ల నుంచి వచ్చే నీటిని తాగడం తప్ప ఆయనకు వేరే మార్గం లేదు. ఆ నీరు గోధుమ రంగులో ఉంటుంది.

దాదాపు ఎనిమిది నెలలుగా ఇదే పరిస్థితి ఉందని, ఇవి తప్ప తాగడానికి వేరే నీరు దొరకడం లేదని స్థానికులు అంటున్నారు.

''నేను ఇదే నీరు తాగుతున్నాను మేడం'' అన్నారు మార్షల్. మీకు భయం వేయడం లేదా అని అడిగినప్పుడు, 'ఈ నెలతో నాకు 70 ఏళ్లు వస్తాయి' అన్నారాయన.

మార్షల్‌కు కారు లేదు. అందుకే ఆయన నేషనల్ గార్ట్స్ ద్వారా నీటిని అందించే ప్రాంతాలకు వెళ్లలేరు. పక్కనే ఉన్న ఇల్లు ఇటీవల తగలబడి పోవడంతో ఆయన ఇంటికి కరెంటుగానీ, గ్యాస్‌గానీ సరఫరా కావడం లేదు. వచ్చిన నీటిని కాచి వడపోసి తాగడం సాధ్యపడటం లేదు.

"చాలా అరుదుగా మంచి నీళ్లు వస్తుంటాయి. కొన్నిసార్లు లేత గోధుమ రంగు, మరికొన్నిసార్లు ముదురు గోధుమ రంగులో ఉంటాయి. బాత్ టబ్‌లోకి నీళ్లు వదిలితే ముందు మురికి నీళ్లు వస్తాయి. తర్వాత మంచి నీళ్లు వస్తాయి. ప్రతిసారి మురికి వస్తూనే ఉంటుంది" అన్నారాయన.

జాక్సన్ కౌన్సిల్‌ సభ్యుడైన ఆరోన్ బ్యాంక్స్ తన జీవితంలో ఎక్కువ భాగం మిసిసిపీ రాష్ట్ర రాజధానిలోనే నివసించారు. 90% కంటే ఎక్కువ మంది నల్లజాతియులున్న జిల్లాకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

పాతబడిన మౌలిక సదుపాయాలు, వాతావరణ మార్పులు జాక్సన్ ప్రాంతంలో నీటి సరఫరాపై తీవ్రమైన ప్రభావాన్ని చూపాయని తాను భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

2020లో గడ్డకట్టే చలి కారణంగా జాక్సన్ పట్టణంలో మంచినీటి సరఫరా సౌకర్యాలు మూసేయాల్సి వచ్చింది. ఆ సమయంలో తమ జిల్లాలో దాదాపు ఆరు వారాల పాటు నీరు అందకుండా పోయిందని బ్యాంక్స్ చెప్పారు. మిగతా ప్రాంతాలలో ఆ పరిస్థితి లేదు. అప్పటి నుంచి పట్టణంలో మౌలిక వసతుల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.

"గత రెండు సంవత్సరాలలో నీళ్లు కాచి తాగాలని మాకు నోటీస్ రాని నెల లేదు. ఈ నీటికి అలవాటు పడిపోయాం. అమెరికాలో ఎవరికీ ఈ బాధ రాకూడదు'' అన్నారు బ్యాంక్స్ అన్నారు.

ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్న వారిలో ఎక్కువమంది నల్లవారేనని బ్యాంక్స్ అన్నారు. మౌలిక సదుపాయాల కోసం జాక్సన్ పట్టణం చుట్టుపక్కల ప్రాంతాలో భారీ ఎత్తున నిధులు వచ్చాయని, కానీ, ఇక్కడి పరిస్థితులు మాత్రం ఏమీ మారలేదని ఆయన అన్నారు.

ఇక్కడ బాటిల్ నీరు దొరకడం కూడా కష్టమే

నాయకుల సొంత నియోజకవర్గాలకే నిధులు..

అధ్యక్షుడు జో బిడెన్ తెచ్చిన మౌలిక సదుపాయాల బిల్లు జాక్సన్ వంటి వెనుకబడిన ప్రాంతాల కోసం భారీ ఎత్తున నిధులను కేటాయించింది. ఇది 2020లో ఈ ప్రాంతంలో 163,000 జనాభా ఉంది. కానీ, ఇక్కడి రాజకీయాల కారణంగా అసలు సమస్యలపై నేతలు దృష్టి సారించలేదని, తమ సొంత నియోజక వర్గాలకు నిధుల కేటాయింపుకే వారు ప్రాధాన్యమిచ్చారని బ్యాంక్స్ ఆరోపించారు.

''నీటిశుద్ధి కోసం మౌలిక సదుపాయాలు ఉన్నా దాన్ని గత కొన్నేళ్లుగా పట్టించుకునే ప్రయత్నం ఎవరూ చేయలేదు'' అని జాక్సన్ స్టేట్ యూనివర్శిటీలో అర్బన్ ప్లానింగ్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ ప్రొఫెసర్ ఎడ్మండ్ మెరెమ్ అన్నారు.

అయితే, జాక్సన్ ప్రాంతంలో నాసిరకం నీటి సరఫరా, మంచి నీటి కోసం నిధుల కేటాయింపులో నిర్లక్ష్యానికి మరో ప్రధాన కారణం కూడా ఉందని ప్రొఫెసర్ మెరెమ్ అన్నారు. అది జాతి వివక్ష.

జాక్సన్ తోపాటు, మిషిగాన్ ఫ్లింట్ వంటి పట్టణాలో నీటిలో సీసం కలుస్తూ ఉంటుందని, నల్లజాతీయుల పట్ల వివక్ష కారణంగా ఏళ్ల తరబడి ఇక్కడి పరిస్థితుల్లో మార్పు రావడం లేదని నిపుణులు చెబుతున్నారు.

"చాలా దశాబ్దాలుగా ఇక్కడ ఇదే పరిస్థితి కొనసాగుతోంది'' అని న్యాయవాది అరియల్లీ కింగ్ చెప్పారు.

"ఈ దేశంలో జాతి విభజన, రెడ్ లైనింగ్ విధానం కూడా ఇలాంటి పర్యావరణ వివక్షకు దారి తీసింది'' అని అరియల్లీ కింగ్ అన్నారు.

1940లలో నల్లజాతీ వ్యక్తులకు హౌసింగ్ లోన్‌లు ఇవ్వరాదంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రెడ్ లైనింగ్ అంటారు. ఈ నిర్ణయానికి కారణం వారికి రుణాలివ్వడం రిస్క్‌తో కూడుకున్న వ్యవహారని భావించడమే.

ఈ విధానం దాదాపు 40 సంవత్సరాలకు పైగా కొనసాగిందని, ఫలితంగా తక్కువ ఆదాయం ఉన్నవారు, ప్రధానంగా నల్లజాతీయులు మురికివాడలు, చమురు శుద్ధి కర్మాగారుల, మురుగునీటి శుద్ధి కర్మాగారాల వంటి కాలుష్య పరిశ్రమల సమీప ప్రాంతాలలో కేంద్రీకృతం కావాల్సి వచ్చింది అరియల్లీ కింగ్ తెలిపారు. అలాంటి ప్రాంతాలు ఇప్పటికీ అస్తిత్వంలో ఉన్నాయని ఆమె అన్నారు.

మిసిసిపీ నది ఒడ్డున 'క్యాన్సర్ అల్లే’ అని పిలిచే ప్రాంతాలను ఆమె ఉదాహరణగా చూపారు. ఒకప్పుడు లూసియానా రాష్ట్రం విశాలమైన తోటలకు నిలయం. మిసిసిపీ నది వెంబడి ఉన్న ప్రాంతం ఇప్పుడు 150కి పైగా చమురు శుద్ధి కర్మాగారాలు, పరిశ్రమలకు కారిడార్‌గా మారింది.

కుళాయి నీళ్లతో తాను పళ్లు కూడా తోముకోనని సరీనా లార్సన్ అన్నారు

దశాబ్దాలుగా ఇక్కడ ప్రధానంగా నల్లజాతియులు కాలుష్యం కారణంగా దేశంలోనే అత్యధిక క్యాన్సర్ రేట్‌తో ఇబ్బంది పడుతున్నారు.

ఇది పర్యావరణ వివక్ష అని, పేదలు నివసించే జాక్సన్ లాంటి ప్రాంతలలో ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించకుండా వారిని మరింత అనారోగ్యకరమైన పరిస్థితుల్లోకి నెడుతోందని అరియల్లీ కింగ్ ఆరోపించారు.

''ఇక్కడ వరదలు తరచూ వస్తుంటాయి. కానీ, వీటికి అనేక కారణాలున్నాయని ప్రభుత్వం చెబుతుంటుంది. మొదట్లో రెడ్‌లైనింగ్ సమస్య లేకపోతే, వారు ఇలాంటి ప్రాంతాలలో నివసించాల్సిన అవసరం ఉండదు'' అన్నారు అరియల్లీ.

"అంటే ఇది జాతి వివక్ష కారణంగా ఏర్పడిన పరిస్థితి. ఇది మళ్లీ మళ్లీ ఇక్కడ జరుగుతూనే ఉంది'' అన్నారామె.

సరీనా లార్సన్ అనే మహిళ ప్రస్తుతం లా చదువుతున్నారు. ఆమె మార్షల్ ఇంటికి కొద్దిదూరంలోనే నివసిస్తున్నారు. ఆమె కూడా ఆ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలకు కారణం రెడ్‌లైనింగ్ అంటారు.

ఆమె ఇంటిలోకి ప్రవేశించినప్పుడు, వంటగదిలో నేల మీద వివిధ సైజులున్న గిన్నెలు ఉన్నాయి. వాటిలో ఆమె వర్షపు నీటిని పట్టుకుని, ఆపై వాటిని ఫిల్టర్ చేసి తాగుతున్నారు.

"జాక్సన్ ప్రాంతంలో వచ్చే నీళ్ల పైపుల్లో సీసం ఉంటుంది. అందుకే నేను ఆ నీటిని తాగను. ట్యాప్ నీటితో నేను పళ్లు కూడా తోముకోను'' అని ఆమె అన్నారు.

కానీ, ఆమె 300 డాలర్లు ఖరీదైన ఫిల్టర్ కొనుక్కున్నారు. కానీ, తమ ప్రాంతంలో చాలామంది అంత ఖర్చు భరించలేరని ఆమె అన్నారు.

''డబ్బులున్న వాళ్లపై ప్రభావం చూపే వరకు ఇది ఒక సమస్య కాదు. ఇందుకు జాక్సన్ పట్టణమే ఒక ఉదాహరణ. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి ఎప్పటికీ పట్టదు'' అని ఆమె విమర్శించారు.

తరతరాలుగా జాతి వివక్షకు బలైపోతున్నామని ఒలుగ్బాలా-అజీజ్ అన్నారు

స్థానిక కమ్యూనిటీ సెంటర్‌లో ఇమాని ఒలుగ్బాలా-అజీజ్‌ని కలిశాము. అక్కడ ఆమె ఓ స్వచ్చంద సహకారంతో స్థానికులకు బాటిల్ వాటర్ అందజేస్తున్నారు. ఆ బాటిళ్లు గంటలోనే అయిపోయాయి. తన ఇంట్లో కూడా నీటి సమస్య ఉందని ఆమె చెప్పారు.

"ఇది భావాలు, విలువల సంక్షోభం. పర్యావరణ వివక్ష ఇక్కడ కొనసాగుతోంది. మాకు సౌకర్యాలు కల్పించాలని మేం ప్రభుత్వానికి డబ్బు చెల్లిస్తున్నాము. కానీ అవి మాకు అందడం లేదు'' అన్నారామె.

"మేము తక్కువ జాతి వాళ్లం. ఇక్కడ నల్లజాతీయులు తక్కువమంది ఉన్నారు. పట్టణంలో మురికివాడల్లో నివసిస్తుంటాం'' అన్నారామె.

"మాకు పెద్ద పెద్ద ఇళ్లు కావాలని అడగడం లేదు. కనీసం బతకాలనుకుంటున్నాం. స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీటికి నోచుకోవాలనుకుంటున్నాం'' ఒలుగ్బాలా-అజీజ్ అన్నారు.

"ఒక నెల రోజులుగా బాయిల్ వాటర్ అలర్ట్ రాని రోజు లేదు. ఈ నీటిని తాగలేం. పిల్లలకు ఏమిస్తాం, వంటలు ఎలా వండుకుంటాం'' అని ప్రశ్నించారామె.

నల్లజాతీయులు నివసించే ప్రాంతలో నీటి బిల్లులు పెద్ద మొత్తంలో చెల్లించాల్సి వస్తోందని, అదే తెల్లవాళ్లు ఉండే ప్రాంతంలో ఈ పరిస్థితి లేదని ఒలుగ్బాలా-అజీజ్ అన్నారు.

''ఇది మాకు కొత్త కాదు. చాలా సంవత్సరాలుగా కొనసాగుతోంది. కానీ ఇప్పుడు మేం భరించలేని స్థితికి చేరుకున్నాం'' అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Water crisis in America: 'You can't drink tap water here, you can't bath with it, you can't even brush your teeth'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X