‘భారత్‌పై ద్వేషమే! యుద్ధంతో కాశ్మీర్ సాధించలేం’
ఇస్లామాబాద్: కాశ్మీర్‌ను యుద్ధం ద్వారా పాకిస్థాన్ ఎన్నటికీ గెలువలేదని పాకిస్థాన్ విదేశాంగమంత్రి హీనారబ్బానీ ఖర్ స్పష్టం చేశారు. అంతేగాక, పాకిస్థాన్ గత ఆరు దశాబ్దాలుగా పిల్లలకు ఎవరో ఒకరిని ద్వేషించడమే జాతీయ అస్తిత్వంగా నూరిపోస్తున్నదని జియోన్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
'గత 60 ఏళ్లలో మన(పాక్) పిల్లలకు జాతీయ అస్తిత్వం అంటే ద్వేషించడమే అని బోధిస్తూ వచ్చాం. ఇన్నాళ్లూ ఇండియాపై విద్వేషం పెంచుకున్నాం.. ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్‌పై ద్వేషం ప్రకటించుకుంటున్నాం' అని 2011-13 సంవత్సరాల్లో పాక్ విదేశాంగమంత్రిగా పనిచేసిన రబ్బానీ అన్నారు.
'కాశ్మీర్‌ను యుద్ధం చేసి గెలువలేం.. అంటే ఇక మిగిలింది చర్చల మార్గమే.. ఆ చర్చలు జరుగాలంటే భాగస్వామితో సాధారణ సంబంధాలు, పరస్పర విశ్వాస వాతావరణం ఉండాలి' అని ఆమె అన్నారు. ఇదివరకటి పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ప్రభుత్వం వీసా నిబంధనల సడలింపు, సాధారణ వాణిజ్య సంబంధాలు నెలకొల్పడం వంటి చర్యల ద్వారా భారత్‌తో సంబంధాలు మెరుగుపర్చుకొనేందుకు కృషి చేసిందని చెప్పారు.

'భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య గల సమస్యలు విద్వేషపూరిత వాతావరణంలో పరిష్కారం కావు. కాశ్మీర్‌పై మాట్లాడుకోవడం అంటూ మొదలుపెడితే ఎక్కడో అక్కడికి తేలుతాం' అన్నారు. భారత్‌లో బీజేపీ ప్రభుత్వం, పాక్‌లో సైనిక ప్రభుత్వం ఉంటేనే కాశ్మీర్ సమస్య పరిష్కారం సాధ్యమవుతుందని కొందరు నమ్ముతారని గుర్తు చేస్తూ.. సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ కాశ్మీర్ సమస్యపై ఇండియాకు ఎన్నో రాయితీలు ఇచ్చారని చెప్పారు.
ప్రస్తుత పాక్ విదేశాంగ విధానం క్రియాశీలంగా లేదని, స్పందనకే పరిమితమైందని రబ్బానీ అన్నారు. దేశానికి సొంత విధానం, గమ్యం అంటూ ఏవీ లేవని, ఆమె పేర్కొన్నారు. ఇటీవల పాక్-అమెరికా సంబంధాలు దిగజారిపోవడం, ఇండియా పట్ల అమెరికా మొగ్గు చూపడానికి ఆర్థికరంగం, మార్కెట్‌తోపాటుగా చైనాను అదుపు చేయాలన్న ఆకాంక్ష కారణమని అన్నారు.
ఇండియా ఓ అణ్వస్త్ర దేశమని, సైనికశక్తిగా ఎదిగిందని అమెరికా మొగ్గుచూపుతున్నదా? అంటే 'అదేమీకాదు.. ఇండియాకు ప్రజల బలం ఉంది. ప్రజాస్వామిక సంప్రదాయాలున్నాయి. మనం పోటీపడాల్సింది ఈ అంశాల్లోనే' అని ఆమె స్పష్టం చేశారు. ఆఫ్ఘన్ జిహాద్‌లోకి పాకిస్థాన్ తలదూర్చడం తప్పేనని అన్నారు. 'అమెరికాపై ఆధారపడటం అనేది వాస్తవం కన్నా ఎక్కువగా మన మెదళ్లలో ఉంది' అని హీనా రాబ్బానీ ఖర్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications