సమోసాలు తింటాం- దిల్జీత్ పాటలకు స్టెప్పులేస్తాం: అమెరికా మంత్రి
వాషింగ్టన్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తలపెట్టిన అమెరికా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. వైట్ హౌస్‌లో జో బైడెన్- ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఏర్పాటు చేసిన స్టేట్ డిన్నర్‌కు హాజరయ్యారు. బైడెన్ దంపతులు సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి భారత్- అమెరికాకు చెందిన పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలు, పెట్టుబడులు, ఆర్థిక వ్యవహారాలపై చర్చించారు.
అనంతరం మోదీ.. అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమల హ్యారిస్, విదేశాంగ శాఖ మంత్రి ఆంటొని బ్లింకెన్ ఇచ్చిన విందుకు హాజరయ్యారు. తొలుత బ్లింకెన్ మాట్లాడారు. ఈ రెండు దేశాలు ప్రజాస్వామ్య విలువపై ఆధారపడి మనుగడ సాగిస్తోన్నాయని అన్నారు. ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా సరే, అందరినీ సమానంగా చూడగలగటమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. భారత్- అమెరికా సంబంధాలు చిరకాలం పాటు కొనసాగుతాయని వ్యాఖ్యానించారు.

భారతీయ తత్వం అనేది తమ దైనందిన జీవితంలో ఓ భాగంగా మారిందని బ్లింకెన్ చెప్పారు. సమోసాలను రుచి చూస్తూ ఝుంపా లాహిరి రాసిన నవలలను చదువుతుంటామని, దిల్జీత్ దొసాంజ్ బీట్స్‌కు అనుగుణంగా స్టెప్స్ వేస్తుంటామని అన్నారు. రోజూ వేసే యోగాసనాలను ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన ఘనత భారత్‌కు ఉందని ప్రశంసించారు. ఇవన్నీ తమ దైనందిన జీవితంలో భాగమని పేర్కొన్నారు.

అనంతరం కమల హ్యారిస్ మాట్లాడుతూ- ఉపాధ్యక్షురాలి హోదాలో తాను పలు దేశాలను సందర్శించానని, అన్నింటికంటే భారత్ ఓ అద్భుతమైన దేశంగా కనిపించిందని అన్నారు. భారత్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్లు వేలాదిమంది ప్రాణాలను కాపాడాయని కితాబిచ్చారు. మెదీ చేపట్టిన ఈ పర్యటన తమ రెండు దేశాల మధ్య కొనసాగుతూ వస్తోన్న దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసినట్టయిందని అన్నారు.

అనంతరం మోదీ మాట్లాడారు. భారత్- అమెరికా సంబంధాలు ఓ మధుర గీతం లాంటివని మోదీ చెప్పారు. అగ్రరాజ్యంగా గుర్తింపు పొందిన అమెరికా సాధించిన విజయాలు ప్రపంచ దేశాలకు స్ఫూర్తినిచ్చాయని చెప్పారు. కమలా హ్యారిస్.. అమెరికా ఉపాధ్యక్ష పదవికి చేరుకున్న సమయంలో తాను ఎంతో ఆనందించానని, భారత సంతతికి చెందిన మహిళ అమెరికా వంటి దేశానికి ఉపాధ్యక్షురాలు కావడం సాధారణ విషయం కాదని అన్నారు. ఆర్టెమిస్ అకార్డ్స్‌పై సంతకం చేయడం పట్ల కమల హ్యారిస్.. మోదీకి కృతజ్ఞతలు చెప్పారు.












Click it and Unblock the Notifications