మీ నుంచి మేము కోరుకునేది అదే: రష్యా, చైనా సమక్షంలో తేల్చి చెప్పిన ప్రధాని మోదీ
PM Modi at BRICS: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్నారు. ప్రతిష్ఠాత్మకమైన బ్రిక్స్ అత్యున్నత సమావేశంలో పాల్గొనడానికి మంగళవారం ఉదయమే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నానికి కజాన్‌కు చేరుకున్నారు. బ్రిక్స్ సమ్మిట్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోంది ఈ నగరమే.
బెల్జియం, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలకు బ్రిక్స్‌లో సభ్యత్వం ఉంది. ఆయా దేశాల పేర్లల్లో తొలి అక్షరాన్ని తీసుకుని దీనికి ఈ పేరు పెట్టారు. ఇరాన్, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా, టర్కీ దేశాలు ప్రత్యేక ఆహ్వానితులుగా కొనసాగుతున్నాయి. ఈ సారి ఈ సమావేశానికి రష్యా వేదిక. ఇది 16వ సమ్మిట్.

బ్రిక్స్ ప్లీనరీ కొద్దిసేపటి కిందటే ఆరంభమైంది. ప్రధాని మోదీ, రష్యా, చైనా అధినేతలు వ్లాదిమిర్ పుతిన్, గ్ఝి జిన్‌పింగ్ సహా ఆయా దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు ఇందులో పాల్గొన్నారు. పుతిన్ ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం జిన్‌పింగ్ మాట్లాడారు. లెబనాన్, గాజాలపై ఇజ్రాయెల్ సాగిస్తోన్న యుద్ధంపై మాట్లాడారు. కాల్పులు విరమణను ప్రకటంచాలంటూ విజ్ఞప్తి చేశారు.
అనంతరం ప్రధాని మోదీ మాట్లాడారు. హిందీలో ప్రసంగించారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న యుద్ధం గురించి ప్రస్తావించారు. భారత్ శాంతిని మాత్రమే కోరుకుంటోందని తేల్చి చెప్పారు. కొన్ని దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడటం ప్రపంచ శాంతికి శ్రేయస్కరం కాదని అన్నారు.
ఎట్టి పరిస్థితుల్లో యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతలను తాము కోరుకోబోమని, ఎలాంటి సమస్యలనైనా శాంతియుతంగా చర్చించుకోవడం ద్వారా పరిష్కరించుకోవచ్చనీ పునరుద్ఘాటించారు. శాంతియుత చర్చలకు భారత్ ఎప్పుడూ ముందు ఉంటుందని, వాటికే తమ మద్దతు ఇస్తామనీ స్పష్టం చేశారు.
యుద్ధాల వల్ల ఆయా దేశాలు ఆర్థికంగా ఎంతగానో నష్టపోతాయని, వాటి దుష్ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పడుతుందని మోదీ పేర్కొన్నారు. బ్రిక్స్ అనేది విభజనను ఎప్పటికీ కోరుకోదని, ఐకమత్యానికి, ఏకత్వానికీ మద్దతు ఇస్తుందనే సందేశాన్ని ఈ సమ్మిట్ ద్వారా ప్రపంచ దేశాలకు చాటి చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఉగ్రవాదం, ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహకారాన్ని అందించే దేశాల వైఖరిని మోదీ తప్పు పట్టారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడానికి బ్రిక్స్ సభ్య దేశాల మధ్య సహకారం అవసరమని చెప్పారు. ప్రపంచానికి పెను సవాల్ విసురుతున్న ఉగ్రవాద నిర్మూలన విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు తావు లేదని కుండబద్దలు కొట్టారు.
సైబర్ సెక్యూరిటీ అంశాన్నీ మోదీ ప్రస్తావించారు. సురక్షితమైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోసం కొత్తగా కొన్ని మార్గదర్శకాలను ప్రపంచ దేశాలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కొత్త భాగస్వామ్య దేశాలను బ్రిక్స్‌లో చేర్చుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని మోదీ తెలిపారు.












Click it and Unblock the Notifications