అమెరికా అధ్యక్ష అభ్యర్ధి దొరికినట్లేనా ? యూదు నేపథ్యం, ఒబామా మద్దతు..! ఎవరీ ఓస్సాఫ్?
అమెరికాలో మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ పార్టీ రిపబ్లికన్లను చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పై పట్టు సంపాదించిన డెమెక్రాట్లు ఇప్పుడు మరో రెండేళ్లలో జరిగే అధ్యక్ష ఎన్నికలపై ఫోకస్ పెడుతున్నారు. ఇందుకోసం సరైన అభ్యర్ధి కోసం అన్వేషణ ప్రారంభించారు. ఇందులో వారికి లభించిన ఫస్ట్ ఆప్షన్ జాన్ ఓస్సాఫ్ (Jon Ossoff). అమెరికాలో తొలి యూదు సెనేటర్, డెమోక్రాట్ల కీలక నేత, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు కలిగిన ఓస్సాఫ్ ను వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
జార్జియా రాష్ట్రానికి చెందిన 39 ఏళ్ల యూదు సెనేటర్ జాన్ ఓస్సాఫ్ యువకుడు, మంచి వాక్పటిమ ఉన్న నేత. మీడియాతో సమర్ధంగా వ్యవహరించగల వ్యక్తిగా కూడా ఆయనకు పేరుంది. ట్రంప్ విధానాలను తీవ్రంగా తప్పుబడుతూ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న నాయకుడు కావడంతో పాటు ఒబామా మద్దతు లభిస్తుండటంతో వచ్చే అధ్యక్ష ఎన్నికలకు ఆయన్ని నిలబెట్టేందుకు డెమోక్రాట్లు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన తనకు ఆ ఆలోచన లేదని చెబుతున్నారు. అయినా ఓస్సాఫ్ నే బరిలో దింపేందుకు డెమోక్రాట్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

జార్జియాలో జన్మించిన ఓస్సాఫ్ జార్జ్ టౌన్ యూనివర్శిటీలో చదువుకున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఉన్నత విద్యనభ్యసించారు. రాజకీయాల్లోకి రాకముందు పరిశోధనాత్మక జర్నలిస్టుగా పనిచేశారు. అంతర్జాతీయ మీడియా సంస్థల కోసం అవినీతి, వ్యవస్థీకృత నేరాలు, మానవ అక్రమ రవాణా, యుద్ద నేరాలపై పలు డాక్యుమెంటరీలు తీశారు. 2017లో జార్జియా స్ధానానికి జరిగిన ఉపఎన్నికలో పోటీ చేసి ఓడిపోయారు. అయినా ఆయన దూకుడుతో జాతీయ స్ధాయిలో మంచి పేరు తెచ్చుకున్నారు. 2021లో జార్జియా నుంచే సెనేట్ కు ఎన్నికయ్యారు.

పౌరహక్కుల దిగ్గజం జాన్ లూయిస్ తో ఓస్సాఫ్ కు మంచి అనుబంధం ఉంది. అలాగే స్వతాహాగా యూదు అయినా ఇజ్రాయెల్ విధానాల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారన్న పేరుంది. ఇజ్రాయెల్ భద్రతకు అమెరికా మద్దతు ఉండాలని చెప్పే ఓస్సాఫ్.. నెతన్యాహు సైనిక చర్యల్ని మాత్రం తీవ్రంగా తప్పుబడుతున్నారు. ముఖ్యంగా గాజాలో ఏర్పడిన మానవతా సంక్షోభంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా జార్జియా నుంచి మరోసారి సెనేటర్ గా గెలిచిన ఓస్సాఫ్.. యువ ఓటర్లు, మధ్యతరగతి ఓటర్లు, మధ్యతరగతి ప్రజలతో అనుబంధం ఏర్పరచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ట్రంప్ విధానాల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఓస్సాఫ్ .. ఆయన సొంత రాష్టమైన జార్జియా నుంచే తాజాగా రెండోసారి సెనేటర్ గా గెలిచారు. దీంతో ఆయన అధ్యక్ష అభ్యర్ధి అయ్యే అవకాశం ఉంది.














Click it and Unblock the Notifications
