జెర్రీమాండరింగ్: ట్రంప్ ఓటమి నుంచి బీజేపీ నేర్చుకోవాల్సిన పాఠం..!
అమెరికాలో తాజాగా జరిగిన మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీ ఘోర పరాజయాలు చవిచూస్తోంది. సాధారణంగా అయితే భారత్ లో దీనిపై ఎలాంటి చర్చా ఉండేది కాదు. కానీ రిపబ్లికన్ పార్టీ వ్యవహారశైలిని భారత్ లో అధికార బీజేపీతో పోలుస్తూ పలు విశ్లేషణలు జరుగుతున్నాయి. బీజేపీ అనుసరిస్తున్న విద్వేష రాజకీయాలతో పాటు నియోజకవర్గాల పునర్విభజన, జనగణన విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో అసలు అమెరికాలో ఏం జరిగిందో , దాన్నుంచి బీజేపీ నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటో 'ద హిందూ' ప్రత్యేకంగా విశ్లేషించింది. దీని ఆధారంగా వన్ ఇండియా కథనం చూద్దాం.
బీజేపీ డీలిమిటేషన్, జనగణన- అమెరికా మార్పులు
బీజేపీ (Bjp) 2021లో జరగాల్సిన జనగణను వివిధ సాకులు చూపుతూ 2026కు వాయిదా వేసింది. అలాగే సాధారణ షెడ్యూల్ కు భిన్నంగా జనగణన నిర్వహించి, ఆ తర్వాత దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు ప్రణాళికలు రచించింది. బీజేపీ రాజకీయ పక్షపాతంతో ఈ ప్రక్రియను హడావిడిగా, రహస్యంగా చేపట్టడంపై విపక్షాలు ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్నాయి. అయినా అవేవీ పట్టించుకోకుండా కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ ముందుకెళుతోంది. సరిగ్గా ఇదే తరహాలో అమెరికాలోనూ ఎనిమిది రాష్ట్రాల్లో కాంగ్రెస్ నియోజకవర్గాల సరిహద్దులను తిరిగి రూపొందించింది. తద్వారా ఇప్పటికే డెమోక్రాట్లు అధికారంలో ఉన్న స్ధానాల్ని తమ ఖాతాలో వేసుకోవచ్చని భావించింది. కానీ ఈ ప్రయత్నంలో రిపబ్లికన్లకు మధ్యంతర ఎన్నికల ఫలితాలు గట్టి షాకిచ్చాయి. అంతే కాదు తమకు బలమైన పట్టున్న టెక్సాస్, ఫ్లోరియనా వంటి రాష్ట్రాల్లోనూ అనుకున్న స్ధానాల్ని నిలబెట్టుకోలేకపోయారు.

జెర్రీ మాండరింగ్
ఇలా రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల నియోజకవర్గాల సరిహద్దులను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రక్రియనే జెర్రీమాండరింగ్ (Gerrymandering) అంటారు. ఒకే సామాజిక వర్గాల ఓటర్లను ఒకే నియోజకవర్గంలో ఎక్కువగా కేంద్రీకరించడం లేదా వివిధ నియోజకవర్గాల్లో విభజించడం ద్వారా ఎన్నికల సరిహద్దులను రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా మార్చడాన్ని గెర్రీమాండరింగ్ గా పిలుస్తారు. ఈ విధానం ఎన్నికల మధ్య కాలంలో ఓటర్ల రాజకీయ అభిప్రాయాలు మారవని భావిస్తుంది. కానీ, ఒక పార్టీకి సంప్రదాయంగా మద్దతు ఇచ్చే ఓటర్లే ఆ పార్టీకి వ్యతిరేకంగా మారితే, నియోజకవర్గాల సరిహద్దుల రూపకల్పన పెద్దగా ప్రయోజనం కలిగించదని అమెరికా ఫలితాలు స్పష్టం చేశాయి.

భారత్ లో ఇప్పటికే ట్రైలర్
భారత్ లోనూ గత ఆగస్టులో బీహార్‌లో జరిగిన బాంకీపూర్ ఉప ఎన్నిక ఇదే విషయాన్ని నిరూపించింది. జనాభా కూర్పు, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని బీజేపీ గెలుపుకు అనుకూలంగా ఉన్న నియోజకవర్గంగా బాంకీపూర్‌ను భావించారు. అయితే, ఆ పార్టీకి సంప్రదాయ మద్దతుదారులుగా ఉన్న అగ్రవర్ణాల ఓటర్లు తమ వైఖరిని మార్చుకోవడంతో ప్రశాంత్ కిషోర్ గెలిచి, బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో నియోజకవర్గాల సరిహద్దులను తమకు అనుకూలంగా మార్చుకోవడం మాత్రమే ఎన్నికల్లో విజయాన్ని సాధించిపెట్టడని, రాజకీయ అభిప్రాయాలు, మారుతున్న సామాజిక సమీకరణాలు కూడా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయని అమెరికా ఫలితాలే కాదు బాంకీపూర్ వంటి ఫలితాలు కూడా బీజేపీకి గుర్తుచేస్తున్నాయి.














Click it and Unblock the Notifications
