రేపే ఇరాన్‌ అధ్యక్ష ఎన్నికలు: సంస్కరణ వాద రౌహానీ, సంప్రదాయ రైసీల్లో విజయమెవరిది?

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

టెహ్రాన్: మధ్యప్రాచ్యంలో కీలకదేశమైన ఇరాన్‌లో శుక్రవారం అధ్యక్ష పదవికి జరుగనున్న ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను కలిగిస్తున్నాయి. సంస్కరణవాది అయిన ప్రస్తుత అధ్యక్షుడు రౌహనీ రెండో పర్యాయం పోటీ చేస్తుండగా ఆయనకు పోటీగా సంప్రదాయ వాదుల మద్దతుతో ఇబ్రహీం రైసీ బరిలో ఉన్నారు. అమెరికాకు సుదీర్ఘకాలం వ్యతిరేకంగా ఉన్న ఇరాన్‌ రౌహానీ రాకతో స్నేహహస్తం అందించింది. ఫలితంగా అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఇరాన్‌పై విధించిన ఆంక్షలను ఎత్తివేశారు. దీంతో ఇరాన్‌ ఆర్థికాభివృద్ధిలో గణనీయశక్తిగా ఎదిగింది.

గల్ఫ్‌ జలసంధిలో ఉన్న ఇరాన్‌ వ్యూహాత్మకంగా కీలకమైన ప్రదేశంలో ఉంది. ప్రపంచంలో చమురు సరఫరా చాలాఎక్కువ శాతం ఇక్కడ నుంచే రవాణా అవుతుండటం గమనార్హం. 1979లో ఆయతుల్లా నేతృత్వంలోని ఇస్లామిక్‌ విప్లవం విజయవంతం కావడంతో ఇరాన్‌ చరిత్రలో నూతన శకం ప్రారంభమైంది.

 Who will win Iran's presidential election?

చమురుతో పాటు సైనిక పాటవమున్న దేశం ఇరాన్‌. దీంతో పాటు ప్రపంచంలోని షియా మతస్థులకు అండగా నిలవడంతో పాటు సౌదీ అరేబియాకు ధీటుగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో హసన్ రౌహానీ తిరిగి విజయం సాధించే అవకాశాలు ఉన్నా ఇబ్రహీం రైసీ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నది. ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థలో అంశాలపై చర్చ సాగింది.

రౌహానీ సంస్కరణలపై ఇరానీయన్ల గురి

2013లో మోడరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ పార్టీ నేత హసన్‌ రౌహానీ అధ్యక్షుడిగా గెలుపొందారు. 2015లో అణ్వాయుధాల తయారీని నిలిపివేస్తున్నట్టు ప్రకటించడంతో అంతర్జాతీయం సమాజం ఇరాన్‌పై విధించిన పలు ఆంక్షలను సడలించింది. దీంతో ఆర్థికాభివృద్ధిలో దూసుకుపోయింది. రౌహానీ పదవీ కాలంలో 40 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణాన్ని 9.5 శాతానికి తగ్గడంతో ప్రజల్లో ఆయనపై ఉన్న నమ్మకం రెట్టింపైంది. వ్యక్తిగత స్వేచ్ఛ, అవినీతిపై వ్యతిరేకత.. తదితర అంశాలను ప్రచారంలో ఎక్కువగా ప్రస్తావించారు. ప్రచారంలో సంప్రదాయ వాదుల కంటే మెరుగైన స్థానంలో ఉన్న రౌహానీకి ప్రజల మద్దతు ఇతోధికంగా ఉన్నది. సంప్రదాయ వాదులంతా రైసీకి మద్దతు ప్రకటిస్తున్నా.. రౌహానీకి మధ్యేవాదులు, సంస్కరణ వాదుల మద్దతు ఇతోధికంగా లభించడం కలిసొచ్చే అంశమని చెప్తున్నారు. 2009 గ్రీన్ మూవ్ మెంట్, మాజీ అధ్యక్షుడు మహ్మద్ ఖతామీ తదితరుల అరెస్ట్‌పై ప్రజలు రౌహానీకి మద్దతు పలికారు.

 Who will win Iran's presidential election?

సంప్రదాయ వాదిగా ఇబ్రహీం రైసీపై ముద్ర

సంప్రదాయవాదిగా పేరొందిన ఈ మాజీ అటార్నీ జనరల్‌ ఇబ్రహీం రైసీ.. దేశంలో ఆధ్యాత్మిక గురువు ఆయాతుల్లా అలీ ఖమేనీకి నమ్మకస్తుల్లో ఒకరు. మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ అహ్మదీ నెజాద్‌ ప్రవేశపెట్టిన పేదలకు నేరుగా ధనాన్ని అందించే పథకాన్ని తిరిగి ప్రవేశపెడుతానని హామీ ఇచ్చినా ప్రజలను ఆకట్టుకోలేకపోయాడన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 1988లో జరిగిన సామూహిక ఖైదీల వూచకోతలో ఈయన పాత్ర వున్నట్లు ఆరోపణలు ప్రతికూల అంశంగా చెప్పొచ్చు. మరోవైపు టెహ్రాన్‌ మేయర్‌ మహ్మద్‌ బగేర్‌ పోటీ నుంచి తప్పుకోవడంతో రైసీ విజయ అవకాశాలు పెరిగినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. సంప్రదాయ వాదులు పూర్తిగా మద్దతు ప్రకటించాలని భావిస్తున్నా ఆధ్యాత్మిక గురువు ఖైమేనీ మద్దతు తప్పనిసరి కావాలి. మరో గమ్మత్తేమిటంటే పేరుకు ఐక్యత ప్రదర్శిస్తున్న సంప్రదాయ వాదులు ఎవరి దారి వారిదేనన్నట్లు వ్యవహరిస్తున్నారు.

ఏకపక్ష వాది రైసీకి మద్దతు అనుమానమే

న్యాయవ్యవస్థ, భద్రతా వ్యవస్థలతో సన్నిహిత సంబంధాలు గల ఇబ్రహీం రైసీకి కార్యనిర్వాహక అనుభవం తక్కువేనని చెప్పారు. ఇటీవలి కాలంలో విస్త్రుత స్థాయిలో సంప్రదాయ వాదుల మద్దతుతో సోషల్ మీడియా పోటెత్తింది. గురువారం నుంచి రాజ్యాంగ బద్ధంగా మీడియాపై నిషేధం అమలు నుంచి రైసీ లబ్ది చేకూరే అవకాశాలు ఉన్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద రౌహానీ మద్దతుదారులకు రైసీ మద్దతుదారుల నుంచి బెదిరింపులు తప్పకపోవచ్చు. ఆధ్యాత్మిక గురువు ఖైమేనీ మద్దతునివ్వాలని భావించినా.. అమెరికా పట్ల వ్యతిరేకత, ఇతర అంశాల్లో ఒంటెద్దు పోకడలే రైసీకి ఇబ్బందికరమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాకపోతే రౌహానీ, రైసీ ఇద్దరిలో ఎవరూ గెలిచినా కలిసి పనిచేసేందుకు ఖైమేనీ సిద్ధంగా ఉన్నారు. అయితే రౌహానీ మళ్లీ విజయం సాధిస్తే మాత్రం దేశీయంగా వివిధ అంశాలపై విధాన నిర్ణయాల్లో కోత విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 Who will win Iran's presidential election?

ఎవరు గెలిచినా భారత్‌కు ఓకే

మధ్యప్రాచ్యంలో ఇరాన్‌తో భారత్‌కు ప్రాచీన కాలం నుంచి ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి. ఇరాన్‌లోని చాబహార్‌ నౌకాశ్రయాన్ని భారత్‌ నిర్మిస్తోంది. పాకిస్థాన్ లోని గ్వాదర్‌ నౌకాశ్రయం ఇక్కడ నుంచి కేవలం 70 కి.మీ. దూరంలో ఉండటంతో చాబహార్‌ నిర్మాణం భారత్‌కు ఎంతగానో ఉపకరిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇరాన్‌ ద్వారా భారత్‌ ఆఫ్గనిస్థాన్‌తో పాటు మధ్య ఆసియా దేశాలతో వాణిజ్య సంబంధాలను విస్తరించుకుంటోంది. తద్వారా పాక్‌ను సమర్థంగా నియంత్రించగలుగుతోంది. ఇరాన్‌ ఎన్నికల్లో ఎవరు విజయం సాధించినా మనదేశంతో సన్నిహిత సంబంధాలు ఇదేస్థాయిలో కొనసాగుతాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Iran’s presidential elections take place on May 19. And though the race has become closer and more interesting than anyone might have expected, incumbent President Hassan Rouhani will still likely win re-election.
Please Wait while comments are loading...