పోలియో తిష్ట వేసిన దేశం. ఇంటింటికి టీకాలు బంద్. ప్రపంచానికి ముప్పుగా మారిన ఆ రెండు కంట్రీస్
ప్రపంచవ్యాప్తంగా పోలియో రహిత భవిష్యత్తు కోసం దశాబ్దాలుగా చేస్తున్న పోరాటంలో అద్భుత విజయాలు నమోదయ్యాయి. ఒకప్పుడు 125కి పైగా దేశాల్లో లక్షలాది మంది పిల్లలను వికలాంగులుగా మార్చిన ఈ భయంకరమైన మహమ్మారి, నేడు 99 శాతానికి పైగా భూగోళం నుంచి తుడిచిపెట్టుకుపోయింది. అయితే, ఎంత ప్రయత్నించినా ప్రపంచపటంలో కేవలం రెండే రెండు దేశాలు మాత్రం ఈ వైరస్‌కు నిలయాలుగా మిగిలిపోయాయి. అవే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. ఈ రెండు పొరుగు దేశాల్లో వైరస్ తీవ్రత తగ్గకపోవడానికి ఉన్న కారణాలు, రాబోయే సవాళ్లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఊహించని రీతిలో మళ్లీ పెరుగుతున్న కేసులు
గడిచిన కొన్నేళ్లుగా సాగుతున్న పోరాటంలో ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి మళ్లీ మొదటికి వస్తోంది. 2025లో మొత్తం 21 వైల్డ్ పోలియో కేసులు నమోదు కాగా, 2026 నాటికి ఆ సంఖ్య రెట్టింపై ఏకంగా 42కు చేరింది. మరోవైపు పాకిస్తాన్‌లో గతేడాది 31 కేసులు వెలుగుచూడగా, ఈ ఏడాది ఇప్పటివరకు 6 కేసులకు తగ్గడం కాస్త ఉపశమనం కలిగించే అంశమే. కానీ, 2023లో రెండు దేశాల్లో కలిపి కేవలం 12 కేసులు మాత్రమే నమోదవగా, 2024లో అవి ఒక్కసారిగా 99కి చేరడం ఈ వైరస్ ఎంత ప్రమాదకరంగా దాడి చేస్తుందో స్పష్టం చేస్తోంది. కేవలం పక్షవాతం బారిన పడుతున్న పిల్లల సంఖ్య మాత్రమే కాకుండా, డ్రైనేజీ శాంపిల్స్ సైతం పోలియో వైరస్ చురుగ్గా ఉందనే నిజాలు బయటపడుతున్నాయి.
ఇంటీంటికీ టీకాలు బంద్.. తాలిబన్ల నిబంధనలే శాపం!
పోలియో నియంత్రణలో ఆఫ్గానిస్తాన్ దారుణంగా వెనుకబడటానికి అక్కడి పాలకుల నిర్ణయాలే కారణమవుతున్నాయి. ఇళ్లకు వెళ్లి పిల్లలకు చుక్కల మందు వేసే 'ఇంటింటి ప్రచారాన్ని' తాలిబన్ ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. కేవలం మసీదులు, నిర్ణీత కేంద్రాల వద్ద మాత్రమే టీకాలు వేయాలనే నిబంధన విధించడం వల్ల లక్షలాది మంది చిన్నపిల్లలు టీకాలకు దూరమవుతున్నారు. దీనికి తోడు ఆరోగ్య కార్యకర్తలుగా మహిళలు పనిచేయడంపై ఉన్న ఆంక్షలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేశాయి. దక్షిణ ఆఫ్గానిస్తాన్‌లోని కాందహార్, నంగర్‌హార్, రాజధాని కాబూల్ నగరాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది.
పాకిస్తాన్‌లో భయానక వాతావరణం!
పాకిస్తాన్‌లో ఇళ్ల వద్దకే వెళ్లే వెసులుబాటు ఉన్నప్పటికీ, అక్కడ పనిచేస్తున్న పోలియో సిబ్బంది ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. టీకాలు వేసే బృందాలపై నిరంతరం దాడులు జరుగుతున్నాయి. పోలియో టీకాలు విదేశీ కుట్ర అని, పిల్లలకు సంతానలేమి కలిగిస్తాయనే మూఢనమ్మకాలతో పాటు కరడుగట్టిన తీవ్రవాదుల బెదిరింపులు అతిపెద్ద సవాలుగా మారాయి. 1990ల నుంచి ఇప్పటివరకు 200 మందికి పైగా పోలియో పారిశుధ్య కార్మికులు, వారికి భద్రతగా వచ్చిన పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్తాన్, కరాచీ వంటి ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ సక్రమంగా సాగడం లేదు.
సరిహద్దులు దాటుతున్న మహమ్మారి.. మన దేశానికి కూడా ముప్పే!
పాకిస్తాన్ - ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్న పొడవైన సరిహద్దుల గుండా రోజూ వేలాది మంది ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. గడిచిన కాలంలో లక్షలాది మంది శరణార్థులు పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్‌కు తిరిగెళ్లినప్పుడు వారి ద్వారా వైరస్ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి విస్తరించింది. అంతేకాకుండా, జర్మనీలోని హంబర్గ్ నగర డ్రైనేజీ నమూనాలో కూడా వైల్డ్ పోలియో వైరస్ ఆనవాళ్లు కనిపించడం అంతర్జాతీయంగా ఆందోళన రేకెత్తించింది. ఈ వైరస్ వ్యాప్తిని ఇప్పుడే అరికట్టకపోతే రాబోయే పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 2 లక్షల మంది పిల్లలు మళ్లీ పోలియో బారిన పడే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
భారత్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు!
ఒకప్పుడు ప్రపంచ పోలియో కేసుల్లో ఏకంగా 60 శాతం కేసులు మన భారతదేశంలోనే నమోదయ్యేవి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి అధిక జనాభా ఉన్న రాష్ట్రాల నుంచి పోలియోను తరిమికొట్టడం అసాధ్యమని అంతర్జాతీయ నిపుణులు భావించారు. కానీ, 1995లో ప్రారంభమైన 'పల్స్ పోలియో' ఉద్యమం ద్వారా భారత్ ఆశ్చర్యకర విజయాలు సాధించింది. కోట్లాది ఇళ్లను జల్లెడ పట్టడం, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో టీకా బృందాలను ఉంచడం, స్థానిక మహిళలను, మత పెద్దలను భాగస్వాములను చేసి మూఢనమ్మకాలను పటాపంచలు చేయడం ద్వారా 2011లో భారత్ చివరి కేసును నమోదు చేసింది. ఆ తర్వాత 2014లో భారత్‌ను పూర్తి పోలియో రహిత దేశంగా డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది.
నిధుల కొరతతో కుదేలవుతున్న స్వచ్ఛంద సంస్థలు
ప్రస్తుతం సరిహద్దుల్లో పోలియో పోరాటానికి నిధుల కొరత పెద్ద అడ్డంకిగా మారింది. గ్లోబల్ పోలియో ఎరాడికేషన్ ఇనిషియేటివ్ తమ బడ్జెట్‌లో 30 శాతానికి పైగా కోత విధించింది. అయితే రోటరీ ఇంటర్నేషనల్, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, సౌదీ అరేబియా వంటి సంస్థలు, దేశాలు భారీ నిధులు సమకూరుస్తున్నప్పటికీ, రాజకీయ నిబద్ధత లోపించడం వల్ల వైరస్ పూర్తిగా అంతం కావడం లేదు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లు తక్షణమే ఇళ్ల వద్దకే వెళ్లి టీకాలు వేసే పద్ధతిని పునరుద్ధరించి, ఆరోగ్య కార్యకర్తలకు రక్షణ కల్పిస్తేనే ఈ ప్రపంచం పోలియో రహితంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.














Click it and Unblock the Notifications
