టీమిండియాతో టీ20 సిరీస్ వేళ.. న్యూజిలాండ్ కు ఎదురుదెబ్బ
భారత్‌తో జరుగుతున్న అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌లల్లో పరాజయం పాలైంది న్యూజిలాండ్. తాజాగా జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీ గాయం కారణంగా మిగిలిన మూడు టీ20 మ్యాచ్‌లకు పూర్తిగా దూరం అయ్యాడు. దీనికితోడు రాబోయే వన్డేలు, టెస్టు సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని బౌలర్ల వర్క్‌లోడ్ నేపథ్యంలో న్యూజిలాండ్ మేనేజ్మెంట్ పేస్ బౌలింగ్ విభాగంలో భారీ మార్పులు చేపట్టింది.
శనివారం జరిగిన రెండో టీ20లో హెన్రీ రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి, మైదానాన్ని వీడాల్సి వచ్చింది. పిక్క కండరాలు పట్టేయడంతో అతను మ్యాచ్‌లో తన పూర్తి ఓవర్ల కోటాను పూర్తి చేయలేకపోయాడని కెప్టెన్ మిచెల్ శాంట్నర్ వెల్లడించారు. దీంతో హెన్రీ ప్రస్తుతం క్రైస్ట్‌చర్చ్‌లోనే ఉంటూ కోలుకోంటోన్నాడు. అనంతరం ఆక్లాండ్‌లో ప్రారంభమయ్యే అయిదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ సమయానికి అతను తిరిగి జట్టుతో చేరనున్నాడు.

టీ20 సిరీస్ తర్వాత అయిదు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్ లను ఆడాల్సి ఉంది న్యూజిలాండ్ కు. దీన్ని దృష్టిలో ఉంచుకుని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు బౌలర్ల రొటేషన్ పద్ధతిని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా స్టార్ పేసర్ లోకీ ఫెర్గూసన్ ఆక్లాండ్ వేదికగా జరిగే మూడో టీ20కి విశ్రాంతి తీసుకోనున్నాడు. అతను సిరీస్‌లోని చివరి రెండు మ్యాచ్‌లకు తిరిగి జట్టులోకి రానున్నాడు.
మరోవైపు కైలే జెమీసన్ కూడా ఈ సిరీస్ నుంచి అర్ధాంతరంగా వైదొలగనున్నాడు. మూడో టీ20 ముగిసిన తర్వాత అతను ఫోర్డ్ ట్రోఫీ మ్యాచ్ ఆడేందుకు వెళ్లనున్నాడు. ఈ కారణంగా జెమీసన్ చివరి రెండు టీ20 మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు. అనంతరం భారత్‌తో జరిగే అయిదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు అతను మళ్లీ జట్టుతో చేరుతాడు. పేసర్ల మార్పుల్లో భాగంగా బ్లెయిర్ టిక్నర్‌ను జట్టులోకి తీసుకుంది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్. ఆల్‌రౌండర్ జోష్ క్లార్క్‌సన్ నాలుగు, అయిదో టీ20 మ్యాచ్ లకు ఎంపికయ్యాడు.
ప్రస్తుతం జరుగుతున్న అయిదు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో భారత జట్టు 2-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. రెండో టీ20 మ్యాచ్‌లో ఒక దశలో భారత్ కష్టాల్లో పడినప్పటికీ తిలక్ వర్మ- 51 (నాటౌట్), నితీష్ కుమార్ రెడ్డి- 26 (నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందించారు. ఆక్లాండ్ వేదికగా మూడో టీ20 జరగనుంది.













Click it and Unblock the Notifications
