బహిరంగంగా కరోనా వ్యాక్సిన్ తీసుకుంటాం: ముగ్గురు అమెరికా మాజీ అధ్యక్షుల ప్రకటన
వాషింగ్టన్: అమెరికాలో కరోనా విలయ తాండవం చేస్తున్న తరుణంలో ఆ దేశ మాజీ అధ్యక్షులు సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం లంభించిన తర్వాత కరోనా వ్యాక్సిన్‌ను తీసుకునేందుకు వాలంటీర్లుగా ఉండేందుకు స్వచ్ఛందంగా ముగ్గురు మాజీ అధ్యక్షులు ముందుకు వచ్చారు.
వ్యాక్సిన్ భద్రత, ప్రభావంపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్ స్వచ్ఛందంగా వ్యాక్సిన్ తీసుకుంటామని ప్రకటించారు. తమ ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు ఇదొక శక్తివంతమైన సందేశంగా ఉంటుందని ఈ మాజీ దేశాక్షులు వెల్లడించారు.

అమెరికా పబ్లిక్ హెల్త్ అధికారులు వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలను ఒప్పించడానికి
ప్రయత్నిస్తున్న క్రమంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్, అంటు వ్యాధి నిపుణుడు డాక్టర్ అంథోనీ ఫౌసీ, వైట్ హౌస్ కరోనావైరస్ ప్రతిస్పందన సమన్వయకర్త డాక్టర్ డెబోరా బ్రిక్స్‌తో వీరు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. కెమెరా సాక్షిగా వ్యాక్సిన్ డోసులను తీసుకునేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు.
వ్యాక్సిన్ తీసుకునేందుకు వాలంటీర్‌గా మాజీ అధ్యక్షుడు బుష్ సిద్ధంగా ఉన్నారని ఆయన చీఫ్ ఆఫ్ స్టాప్ ఫ్రెడ్డీ ఫోర్డ్ తెలిపారు. ఇక కరోనా టీకాను ప్రోత్సహించడానికి బహిరంగ ప్రదేశంలో తీసుకోవడానికి తాను కూడా సిద్ధంగా ఉన్నానని క్లింటన్ తెలిపారని క్లింటన్ ప్రెస్ సెక్రటరీ ఏంజెల్ యురేనా వెల్లడించారు. ప్రజారోగ్య అధికారులు నిర్ణయించిన ప్రాధాన్యతల ప్రకారం క్లింటన్ వ్యాక్సిన్ తీసుకుంటారన్నారు.
Recommended Video
మరోవైపు కరోనా వ్యాక్సిన్ సురక్షితమని ఫౌసీ చెప్పినట్లయితే.. తాను కూడా పూర్తిగా విశ్వసిస్తానని, ఖచ్చితంగా టీకా తీసుకుంటానని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కాగా, వచ్చే శుక్రవారం నుంచి అమెరికాలో కరోనా వ్యాక్సిన్ వినియోగంలోకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మాజీ అధ్యక్షులు చేసిన ప్రకటనలు చర్చనీయాంశంగా మారాయి.












Click it and Unblock the Notifications