చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు గుండెపోటు?
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారనే వార్తలు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల కిర్గిజ్‌స్థాన్ పర్యటనకు వచ్చినప్పుడు విమానం మెట్లు దిగుతున్న సమయంలో ఆయన తన భార్య పెంగ్ లియువాన్ చేతిని గట్టిగా పట్టుకుని మెల్లగా నడవడమే ఈ ఊహాగానాలకు ప్రధాన కారణమైంది. ఆ సమయంలో ఆయన ముఖం పాలిపోయి, ఉబ్బినట్లుగా కనిపిస్తోందని.. నడకలో తడబాటు స్పష్టంగా కనిపించిందని సోషల్ మీడియాలో, ముఖ్యంగా ప్రవాస చైనీస్, తైవాన్, టిబెటన్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
షీ జిన్‌పింగ్‌కు 2 సార్లు గుండెపోటు: టిబెట్ మాజీ ప్రధాని
ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ మాజీ ప్రధాని లోబ్సాంగే సాంగే ఈ అంశంపై ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించారు. చైనా ప్రభుత్వంలో పనిచేసిన ఓ సీనియర్ మాజీ అదికారితో జరిగిన సమావేశంలో షీ జిన్‌పింగ్‌కు రెండు నుంచి మూడు సార్లు గుండెపోటు వచ్చిందని ఆ అధికారి తనకు చెప్పినట్లు లోబ్సాంగ్ సాంగే వెల్లడించారు. గతంలో షీ జిన్‌పింగ్ 3 నుంచి 5 వారాల పాటు అకస్మాత్తుగా అదృశ్యమైన, మళ్లీ ప్రత్యక్షమవడమ వెనుక కూడా ఈ ఆరోగ్య సమస్యలే కారణమని ఆయన పేర్కొన్నారు.

అందువల్లే విచిత్రమైన నిర్ణయాలు
తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగానే షీ జిన్‌పింగ్‌కు గుండెపోటులు వచ్చాయని.. ఈ మానసిక గందరగోళం వల్లే ఆయన ఊహించని విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని లోబ్సాంగ్ సాంగే విశ్లేషించారు. స్వయంగా తానే నియమించిన సీనియర్ సైనిక జనరల్స్‌ను, రక్షణ మంత్రిని హఠాత్తుగా పదవుల నుంచి తొలగించడం లేదా వారు మాయమైపోవడం వెనుక ఉన్న అసలు కారణం ఇదేనని చెప్పారు. ప్రస్తుతం చైనాలో మంత్రుల కంటే షీ జిన్‌పింగ్ భద్రతా సిబ్బంది, సైనిక అధిపతులే అత్యంత శక్తివంతంగా మారారని ఆయన వెల్లడించారు.
వారసుడిని ప్రకటిస్తే చైనాలో అంతర్యుద్దం ఖాయం!
షీ జిన్‌పింగ్ తన వారసుడిని ఎందుకు ప్రకటించడం లేదనే విషయమై కూడా లోబ్సాంగ్ సాంగే వివరణ ఇచ్చారు. చైనా చరిత్ర ప్రకారం.. ఓ చక్రవర్తి తన యువరాజును లేదా వారసుడిని ప్రకటిస్తే.. అధికారం కోసం ఆ యువరాజే చక్రవర్తిని అంతమొందించే ప్రమాదం ఉందన్నారు. ఒకవేళ వారసుడిని ప్రకటించకపోతే పాలన పొడిగించుకోవచ్చు కానీ.. అది దేశంలో వివిధ వర్గాల మధ్య తీవ్రమైన అధికార పోరాటానికి, అంతిమంగా తిరుగుబాటు లేదా అంతర్యుద్ధానికి దారితీస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. చైనా ప్రస్తుతం అదే సందిగ్ధంలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
టిబెట్ ప్రవాస ప్రభుత్వం నేపథ్యం
ఇదే సందర్భంగా ప్రవాస టిబెట్ ప్రభుత్వం గురించి వివరిస్తూ.. 1950లో చైనా సైన్యం టిబెట్ ను ఆక్రమించుకుందని.. 1959 లాసా తిరుగుబాటు తర్వాత దలైలామాతో పాటు వేలాది మంది టిబెటన్లు ఇండియాకు పారిపోయి వచ్చారని లోబ్సాంగ్ సాంగే గుర్తు చేశారు. అప్పటి నుంచి ఇండియాలోని ధర్మశాల కేంద్రంగా ప్రవాస టిబెటన్ ప్రభుత్వం పనిచేస్తూ తన హక్కుల కోసం పోరాడుతోందని.. చైనా మాత్రం ఆ ప్రభుత్వాన్ని గుర్తించకుండా తన సొంత ప్రాంతంగా ప్రకటించుకుంటోందని వివరించారు.














Click it and Unblock the Notifications