మక్కా మదీనానూ వదలని హౌతీలు: వైమానిక దాడులు
సౌదీ అరేబియాలోని ఇస్లామిక్ పవిత్ర నగరం మక్కా, మదీనాను యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు టార్గెట్ గా చేసుకున్నారు. తాజాగా డ్రోన్ దాడికి దిగారు. వీటిని సౌదీ అరేబియా సైన్యం అడ్డుకుంది. లక్ష్యాన్ని తాకక ముందే వాటిని ధ్వంసం చేసింది. మహమ్మద్ ప్రవక్త మసీదు ఉన్న సున్నిత ప్రాంతంలో వైమానిక దాడికి హౌతీలు ప్రయత్నించడం కలకలం రేపింది. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ ఛాయలు అలముకున్నట్టయింది.
దానికి కొద్దిసేపటి ముందే మక్కా ప్రాంతంలోనూ మరొక డ్రోన్‌ను సౌదీ అరేబియా కూల్చివేసింది. ఏటా మిలియన్ల సంఖ్యలో భక్తులు సందర్శించే పవిత్ర నగరాల సమీపంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం పట్ల ఇస్లామిక్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తోన్నాయి. మొన్నటి వరకు కూడా సౌదీ అరేబియాలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఆయిల్ రిఫైనరీలు, పైప్ లైన్లను లక్ష్యంగా చేసుకుంటూ వచ్చిన హౌతీలు ఇప్పుడీ పవిత్ర నగరాలపై దాడులకు తెగబడటం చర్చనీయాంశమౌతోంది.

మరోవైపు.. యెమెన్ భూభాగంలోనూ హౌతీలు తమ దాడులను ఉధృతం చేశారు. యెమెన్ ప్రభుత్వానికి తాత్కాలిక పరిపాలన కేంద్రంగా ఉన్న ఏడెన్ సిటీలోని మాషిక్ ప్రెసిడెన్షియల్ భవన సముదాయం, విమానాశ్రయంపై హౌతీలు ఏకంగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించారు. ఈ దాడుల వల్ల ఇప్పటివరకు ప్రాణ, ఆస్తి నష్టం ఎంతమేర సంభవించిందనేది వెల్లడికాలేదు గానీ.. అధ్యక్ష భవన ప్రాంగణంలోకి అంబులెన్సులు వెళ్లడం, నగరంలో భారీ పేలుళ్లు సంభవించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
యెమెన్ అధ్యక్ష భవనంపై హౌతీలు దాడులు చేయడానికి కారణం లేకపోలేదు. ఇక్కడి తాత్కాలిక ప్రభుత్వానికి సౌదీ అరేబియా మద్దతు ఇస్తోందనేది వారి ప్రధాన ఆరోపణ. ఈ కారణంతోనే అధ్యక్ష భవనాన్ని కూడా వదలట్లేదు. యెమెన్ దక్షిణ ప్రాంతంలో మానవతా సహాయ కార్యక్రమాలకు కీలకమైన రవాణా మార్గం.. ఈ ఏడెన్ విమానాశ్రయం. ఈ మధ్యకాలంలో ఈ రీజియన్ లో వరుసగా దాడులు చోటు చేసుకుంటోండటం సహాయక చర్యలకు విఘాతం కలుగుతోంది.
తాజాగా దాడులపై హౌతీ తిరుగుబాటుదారుల సైనిక అధికార ప్రతినిధి యాహ్యా సరీ స్పందించారు. తాజా దాడులను తోసిపుచ్చారు. మక్కా, మదీనాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడినట్లు వస్తోన్న వార్తల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. తమ సైనిక చర్యలు సౌదీ ఆయిల్ రిఫైనరీలు, సైనిక శిబిరాల వరకే పరిమితమని పేర్కొన్నారు. ఈ పరిణామాలు యెమెన్‌లో శాంతి పునరుద్ధరణ ప్రక్రియను మరింత జటిలం చేయడమే కాకుండా ప్రాంతీయ భద్రతకు సవాల్ గా పరిణమించాయి.












Click it and Unblock the Notifications
