పిక్చర్ అభీ బాకీ హై మై ఫ్రెండ్.. భారత్ కు ట్రంప్ హెచ్చరిక
ఇష్టానుసారంగా విధిస్తోన్న టారిఫ్ లతో భారత్ సహా అన్ని దేశాలనూ బెంబేలెత్తిస్తోన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యాను బద్ధశత్రువుగా పరిగణిస్తోన్నారు. ఆ దేశంతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న.. ప్రత్యేకించి- క్రూడాయిల్ కొనుగోలు చేస్తోన్న దేశాలన్నింటిపైనా విరుచుకుపడుతున్నారు. కొరడా ఝుళిపిస్తోన్నారు.
ఈ క్రమంలో భారత్ పై ఇప్పటికే ఎకాఎకిన 50 శాతం అదనపు టారిఫ్ లను విధించారు డొనాల్డ్ ట్రంప్. తొలుత- 25 శాతంతో సరిపెట్టుకున్నాడనుకున్నప్పటికీ- ఆ తరువాత తాజాగా మరో 25 శాతం అదనపు వడ్డింపులు వడ్డించారు. ఫలితంగా 50 శాతం టారిఫ్ భారం పడింది.. భారత్ పై.

ఇది ఇక్కడితో ఆగేలా కనిపించట్లేదు. రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేసే దేశాలపై మరో విడత టారిఫ్ పెంచడానికి, ఆంక్షలు విధించడానికి అవకాశాలు లేకపోలేదని డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. సెకెండరీ ఆంక్షలు మరింత కఠినంగా ఉంటాయనీ పేర్కొన్నారు.
దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అనంతరం వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్ లో విలేకరులతో మాట్లాడారు. రష్యా నుంచి భారత్ క్రూడాయిల్ ను దిగుమతి చేసుకోవడాన్ని జాతీయ భద్రతకు ముప్పుగా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో భారత్ దిగుమతులపై 25 శాతం అదనపు టారిఫ్ ను విధించాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు.
ఇది ఇక్కడితో ఆగిపోలేదని, మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందని డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. సెకెండరీ శాంక్షన్స్ ఉంటాయనీ స్పష్టం చేశారు. భారత్ పైనే ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారని, చైనా వంటి ఇతర దేశాలు కూడా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నాయని విలేకరులు గుర్తు చేశారు.
అదనపు 25 శాతం టారిఫ్ విధించి ఎనిమిది గంటలు మాత్రమే అయిందని, మున్ముందు ఏం జరుగుతుందో చూద్దామని బదులిచ్చారు. మరిన్ని టారిఫ్ లు, సెకెండరీ శాంక్షన్స్ ఉండబోతోన్నాయని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. చైనాపై కూడా ఇలాంటి అదనపు ఆంక్షలు విధించే అవకాశం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications