అధ్యక్షుడు జెలెన్ స్కీ ఉద్వేగం - తనను సజీవంగా చూడడం ఇదే చివరిసారంటూ..!!
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఉద్వేగానికి గురయ్యారు. రష్యా దాడితో ఉక్రెయిన్ నష్టపోతోంది. రష్యాను అడ్డుకునేందుకు యుద్ధ విమానాలను అందించాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. అమెరికా చట్టసభ్యులకు విజ్ఞప్తి చేశారు. 300 మంది అమెరికా చట్టసభ సభ్యులతో జెలెన్‌స్కీ దాదాపు గంటపాటు సంభాషించారు. రష్యా చమురు దిగుమతులపై కూడా ఆంక్షలను కఠినతరం చేయాలని కోరారు. అమెరికా చట్టసభ్యులతో వీడియో కాల్‌లో మాట్లాడిన ఆయన తనను సజీవంగా చూడడం ఇదే చివరిసారి కావచ్చని వ్యాఖ్యానించారు. ఆక్రమణదారుల నుంచి తమ దేశాన్ని కాపాడుకుంటామని అన్నారు.
తమ మాతృభూమిని కాపాడుకునేందుకు ఉక్రెయిన్ ప్రజలు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్నారని ప్రశంసించారు. అదే క్రమంలో తమ గగనతలాన్ని నో-ఫ్లై జోన్‌గా ప్రకటించాలని నాటోను మరోసారి అభ్యర్థించారు. ఆక్రమణదారుల నుంచి మాతృభూమిని కాపాడుకుంటామని ప్రతినబూనారు. స్వదేశానికి వెళ్లాలని రష్యన్ సేనల ముందు ఉక్రెనియన్లు నినదిస్తూనే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్ భూమిలో ప్రతి అంగుళాన్ని రక్షించుకుంటామని ధీమా వ్యక్తం చేసారు. రష్యా దళాలకు ఎదురవుతున్న నిరసన వారికి అవమానకరమని వ్యాఖ్యానించారు.

ఇప్పటికే జెలెన్ స్కీ నాటో దేశాలను తమ గగనతలాన్ని నో-ఫ్లై జోన్‌గా ప్రకటించాలని కోరగా..అందుకు నాటో దేశాలు తిరస్కరించాయి. అలా చేస్తే పూర్తి స్థాయి యుద్దానికి తెర తీసినట్లుగా అభివర్ణించాయి. ఇక, ఇదే సమయంలో రష్యా - ఉక్రెయిన్ మధ్య చర్చ అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. ఇప్పటికే రెండు విడతలుగా జరిగిన చర్చల్లో ఎటువంటి ఫలితం రాలేదు. దీంతో..సోమవారం మరో విడత చర్చలు జరగనున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications