
48,500 ఏళ్ల కిందటి జోంబీ వైరస్‌ను వెలికి తీశారు బాబోయ్..!!
మాస్కో: ప్రాణాంతక కరోనా వైరస్ ఇప్పటికే ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. లక్షలాది మందిని పొట్టనబెట్టుకుంది. చైనా హ్యూబే ప్రావిన్స్‌లోని వుహాన్ సిటీలో పుట్టుకొచ్చిన ఈ మహమ్మారి బారిన పడని దేశమంటూ లేదు. అన్ని దేశాల్లోనూ అడుగు పెట్టిందీ వైరస్. లక్షలాది మంది ప్రజల ప్రాణాలను తీసింది. కోవిడ్ బారిన తీవ్రంగా పడిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంటోంది. 10 కోట్లకు పైగా పాజిటివ్ కేసులు అక్కడ నమోదయ్యాయి. 11 లక్షల మంది దీని బారిన పడి మరణించారు.

ఇప్పటికే కరోనాతో..
భారత్ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. పాజిటివ్ కేసుల సంఖ్య, మృతుల జాబితాలో భారత్ ప్రపంచ దేశాల్లో రెండో స్థానంలో నిలిచింది. నాలుగున్నర కోట్లకు పైగా పాజిటివ్ కేసులు భారత్‌లో నమోదయ్యాయి. అయిదున్నర లక్షలమంది వరకు దీని బారిన పడి మృతిచెందారు. కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి భారత్ సహా కొన్ని దేశాలు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన తరువాత దీని తీవ్రత తగ్గింది. అయినా కరోనా వైరస్ నిర్మూలన కావట్లేదు. మళ్లీ చైనాలో కొత్త కేసులు పుట్టుకొస్తోన్నాయి.

జోంబీ వైరస్ వెలికితీత..
ఉన్నవి చాలవన్నట్లు సైంటిస్టులు మరో ప్రమాదకరమైన వైరస్‌ను వెలికి తీశారు. అదే జోంబీ వైరస్. హాలీవుడ్ సినిమాల ద్వారా మనకందరికీ పరిచయమైన వైరస్ ఇది. జోంబీ రెడ్డి పేరుతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. సినిమాల వరకు చూసుకుంటే- మనుషులను బతికున్న శవాలుగా మార్చే మోస్ట్ డేంజరస్ క్రిమి ఇది. దీని బాధితులు- తమ తోటి వారిని కూడా జోంబీలుగా మార్చేస్తుంటారు.

సినిమాలకే పరిమితం కాలేదు..
అలాంటి అత్యంత ప్రమాదకరమైన వైరస్- సినిమా కథలకే పరిమితం కాలేదు. వాస్తవ రూపాన్ని దాల్చింది. 48,500 సంవత్సరాల కిందట నిద్రాణ స్థితిలో ఉన్న జోంబీ వైరస్‌ను తట్టి మరీ లేపే ప్రయత్నం చేస్తోన్నారు. మంచులో కప్పుకొని పోయి ఉన్న నీటి అడుగున ఉన్న జోంబీ వైరస్‌ను తాజాగా సైంటిస్టులు గుర్తించారు. అక్కడితో ఆగలేదు. దాన్ని వెలికి తీశారు కూడా. పరిశోధనలు సైతం మొదలు పెట్టారు.

దుష్ప్రభావం ఎంత?
ఇన్ని వేల సంవత్సరాల తరువాత కూడా జోంబీ వైరస్ శక్తి ఏమాత్రం తగ్గలేదని, ఇప్పుడు కూడా అది ప్రభావం చూపుతుందనే నిర్ధారణకు వచ్చారు. తొలుత- సైబిరియాలో ఏడు వేర్వేరు ప్రాంతాల్లో మంచులో కప్పుకొని పోయినట్లు గుర్తించారు. అప్పట్లో కొన్ని జీవ జాతులు జోంబీ వైరస్‌కు గురైనట్లు నిర్ధారించారు. ఆ జీవ జాతుల అవశేషాలను వెలికి తీశారు శాస్త్రవేత్తలు. రష్యా, ఫ్రాన్స్, జర్మన్ సైంటిస్టులు ఉమ్మడిగా ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారు.

సైన్స్ మేగజైన్‌లో..
బయో ఆర్‌ఎక్స్‌ఐవీ అనే సైన్స్ మేగజైన్‌లో ఈ జోంబీ వైరస్ వెలికితీత ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రచురించారు. రష్యా, ఫ్రాన్స్, జర్మన్ సైంటిస్టులు ఏడు వేర్వేరు సైబీరియన్ రీజియన్లల్లో 13 కొత్త జోంబీ వైరస్‌లను వెలికి తీసినట్లు ఇందులో స్పష్టం చేశారు. జోంబీ వైరస్ తరహా వ్యాధికారకాలు అప్పుడే ఉన్నట్లు గుర్తించారు. కొన్ని రకాల జీవ జాతులు దీని బారిన పడినట్లు నిర్ధారించారు. 10,000 సంవత్సరాల తరువాత అవి అంటువ్యాధిగా మారినట్లు వివరించారు.

భారీ ఏనుగుల్లో..
అప్పట్లో భారీ ఏనుగులు, ఖడ్గమృగాలు దీని బారిన పడి ఉండొచ్చని, ఆ తరువాత వాటి అవశేషాలు మంచులో కప్పుకొని ఉండొచ్చని గుర్తించారు. దీనికి పండోర వైరస్ యెడోమా అని పేరు పెట్టారు. దాని పరిమాణం, పెర్మాఫ్రొస్ట్ అంటే మంచు శాశ్వతంగా ఉండిపోవడం ఆధారంగా దీని వయస్సును లెక్కగట్టారు.

యూవీ కాంతికి..
ఈ వైరస్‌లు ఇప్పుడున్న వాతావరణానికి అలవాటు పడతాయా? లేదా? అనేది ఉత్కంఠతను రేపుతోంది. అల్ట్రా వయొలెట్ కాంతి కిరణాలు, ఆక్సిజన్, వేడి.. వంటి పరిస్థితుల్లో ఎలా మనుగడ సాగిస్తాయనే విషయంపై ఆరా తీస్తోన్నారు సైంటిస్టులు. ఒకసారి వ్యాప్తి చెందడం మొదలు పెట్టిన తరువాత ఎంతకాలం అవి అంటువ్యాధిగా ఉండగలవనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తోన్నారు. జోంబీ సినిమాల్లో చూపించినట్లుగా ఇతరులకు సోకే అవకాశం ఎంతవరకు ఉంటుందనేది ఇంకా అంచనా వేయలేకపోతున్నారు. దీని తీవ్రత మాత్రం తగ్గలేదని స్పష్టం చేస్తోన్నారు.
తిరుమల శ్రీవారి దర్శనం వేళల్లో కీలక మార్పులు - సామాన్య భక్తులకు..!!