MI vs SRH: భువీ ఆడతాడా? షార్జాలో ముంబై హిట్లర్లను నిలువరించేదెలా? - సండే బిగ్ ఫైట్
ఐపీఎల్ 2020లో భాగంగా ఆదివారం బిగ్ ఫైట్ జరగనుంది. షార్జా వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ ఇవాళ తలపడనున్నాయి. తొలి రెండు మ్యాచ్ ల్లో బెంగళూరు, కోల్ కతా చేతిలో ఓడిన వార్నర్ సేన.. అంతలోనే పుంజుకుని ఢిల్లీని, ఆ వెంటనే బలమైన చెన్నై సూపర్ కింగ్స్ ను మట్టికరిపించింది. ఆదివారం నాటి ముంబై మ్యాచ్ లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించాలని అనుకుంటున్నప్పటికీ మెయిన్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కాలి గాయం జట్టు మొత్తాన్ని కలవరపెడుతోంది..

షార్జాలో వాళ్లను ఆపేదెలా?
సండే బిగ్ ఫైట్ లో భాగంగా హైదరాబాద్, ముంబై జట్లు షార్జాలో తలపడనున్నాయి. ఇప్పటిదాకా దుబాయ్, అబుదాబీల్లో మాత్రమే మ్యాచ్ లు ఆడిన ఈ రెండు జట్లు తొలిసారి షార్జా వేదికగా ఆడనున్నాయి. షార్జా పిచ్ ఫ్లాట్ వికెట్ కావడం, స్టేడియం కూడా చిన్నది కావడంతో ముంబై హిట్టర్లను హైదరాబాద్ ఎలా నిలువరిస్తుందనేది కీలకంగా మారింది. ముంబైలో బంతిని బలంగా బాదే రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్ లాంటి వాళ్లను నిలువరించేందుకు హైదరాబాద్ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే..

భువీ గాయం పెద్దదైందా?
అసలే చిన్న స్టేడియం, పైగా ఫ్లాట్ వికెట్ కావడంతో ఆదివారం షార్జాలో జరగబోయే మ్యాచ్ లో పవర్ ప్లేలో పరుగుల వరదను ఆపడం ఇరు జట్లకూ సవాలుతో కూడుకున్న పనే. బుమ్రా, బోల్ట్, జేమ్స్ పాటిన్సన్లతో ముంబై పేస్ దళం సిద్ధంగా ఉండగా, మిగతా పనిని రాహుల్ చాహర్, కృనాల్ పాండ్యాలు నిర్వహించనున్నారు. అయితే హైదరాబాద్ జట్టులో మాత్రం భువనేశ్వర్ కుమార్ గాయంపై ఒకింత గందరగోళం నెలకొంది. చెన్నైతో జరిగిన మ్యాచ్ లో తొడ కండరాలు పట్టేయడంతో స్పెల్ పూర్తి చేయకుండానే వెళ్లిపోయిన భువీకి గాయం మరింత ముదిరినట్లు తెలుస్తోంది. ఒకవేళ అతను బరిలోకి దిగకుంటే అది ముంబైకి వరం లాంటిదేననే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాగా,

వార్నర్ సైలెన్స్..
పేస్ దళానికి సారధ్యం వహిస్తోన్న భువనేశ్వర్ కుమార్ గాయంపై హైదరాబాద్ జట్టు సారధి డేవిడ్ వార్నర్ ఎలాంటి విషయాన్ని వెల్లడించకపోవడం ఉత్కంఠగా మారింది. ఒకవేళ భువీ గనుక పెవిలియన్ కే పరిమితమైతే, అతని స్థానంలో సిద్ధార్థ్ కౌల్, సందీప్ శర్మ, బసిల్ థంపీల్లో ఒకరు బరిలో దిగే అవకాశం ఉంది. కాదు, భువీనే బరిలోకి దిగినా.. పూర్తి స్థాయి ఫిట్ నెస్ తో పాత స్పీడును కొనసాగిస్తాడా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

టాస్ గెలిస్తే బ్యాటింగే..
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో షార్జా వేదికగా జరిగిన మ్యాచ్ ల్లో భారీ స్కోర్లు నమోదు కావడం తెలిసిందే. ఫ్లాట్ వికెట్ కాబట్టి టాస్ ఎవరు గెలిచినా ముందుగా బ్యాటింగ్ కు దిగే అవకాశముంది. ఒకవేళ ముంబై టాస్ గెలిస్తే గనుక భువీ ఆడతాడా లేదా అనే దానిపైనే సన్‌రైజర్స్ విజయావకాశాలు ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది. నిజానికి ముంబై హిట్టర్లు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, సూర్య కుమార్ యాదవ్ తదితరులకు సన్‌రైజర్స్‌పై గొప్ప రికార్డేమీ లేకున్నా, షార్జా పిచ్, స్టేడియం ప్రత్యేకత ప్రధానాంశంగా మారింది. నటరాజన్ స్థిరంగా రాణిస్తుండటం, స్పిన్నర్ రషీద్ ఖాన్ మళ్లీ ఫాంలోకి రావడం, లోకల్ కుర్రాళ్లు సైతం ఆశించినమేరలో ప్రదర్శన ఇస్తుండటం హైదరాబాద్ కు కలిసొచ్చే అంశం.












Click it and Unblock the Notifications