ఆ నిర్ణయం నుంచి యూటర్న్ తీసుకోను- సెటైర్ల సిక్సర్లు బాదిన అంబటి రాయుడు
అమరావతి/అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ ఇంకొన్ని గంటల్లో ముగియబోతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఫైనల్స్ ఆరంభం కావాల్సి ఉంది. వర్షం వల్ల టాస్ ఆలస్యమైంది. చెన్నై సూపర్ కింగ్స్- గుజరాత్ టైటాన్స్ ఫైనల్స్‌లో తలపడుతోన్నాయి. రాత్రి 9:35 నిమిషాలకు మ్యాచ్ ఆరంభం అయ్యే అవకాశం ఉంది.
మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కాబోతోన్నందున అయిదు ఓవర్ల పాటు మ్యాచ్‌ను కుదించారు. కటాఫ్ టైమ్‌ను 12:06 నిమిషాలుగా నిర్ధారించారు. అప్పటికీ వర్షం ఆగకపోతే మాత్రం మ్యాచ్ రద్దవుతుంది. సోమవారం రిజర్వ్ డే. ఇదే మ్యాచ్‌ను రేపు సాయంత్రం 7:30 గంటలకు రీషెడ్యూల్ చేస్తారు. ప్రస్తుతం అహ్మదాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో వర్షం పడుతోంది.

కాగా- చెన్నై సూపర్ కింగ్స్ మిడిలార్డర్ బ్యాటర్ అంబటి రాయుడికి ఇదే చివరి మ్యాచ్. ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్స్ ఫైనల్ మ్యాచ్‌లో చివరిసారిగా గ్రౌండ్‌లో అడుగుపెట్టబోతోన్నారాయన. దీనితో పూర్తిస్థాయిలో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినట్టవుతుంది. ఇదివరకు అన్ని ఫార్మట్ల క్రికెట్ నుంచి తప్పుకొన్నారు. టెస్ట్, వన్డేలు, టీ20 ఇంటర్నేషనల్స్ నుంచి వైదొలిగారు.
ఇన్ని రోజుల పాటు ఐపీఎల్‌లో మాత్రమే కొనసాగుతూ వస్తోన్నారు. ఇప్పుడిక ఐపీఎల్‌కూ గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ఈ సాయంత్రం ఓ ట్వీట్‌ను పోస్ట్ చేశారు. రెండు అత్యుత్తమ ఫ్రాంఛైజీలైన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యాన్ని వహించారు అంబటి రాయుడు. ఈ రెండు జట్ల తరఫున 204 మ్యాచ్‌లను ఆడాడు.
14 సీజన్లల్లో మెరుపులు మెరిపించాడు. 4,329 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 11 ప్లేఆఫ్స్ మ్యాచ్‌లను ఆడిన ఘనత అంబటి రాయుడికి ఉంది. అలాగే ఎనిమిదిసార్లు ఫైనల్స్ ఆడాడు. అయిదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన జట్లల్లో అతను సభ్యుడు కూడా. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు 15 మ్యాచ్‌లను ఆడాడు. ఆశించిన స్థాయిలో పరుగులను సాధించలేకపోయాడు. అతను చేసిన పరుగులు 139. వ్యక్తిగత హయ్యెస్ట్ స్కోర్ 27.
కాగా- రిటైర్‌మెంట్ తరువాత అంబటి రాయుడు రాజకీయరంగ ప్రవేశం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆయనకు వైఎస్ అభిమానిగా గుర్తింపు ఉంది. వైఎస్ జగన్ అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లకు అతను ఫాలోవర్ కూడా. జగన్ చేసే పోస్టులకు కామెంట్స్ చేస్తుంటారు అంబటి రాయుడు.
ఈ పరిణామాలన్నింటినీ చూస్తోంటే- అంబటి రాయుడు.. రాజకీయ అరంగేట్రం తప్పకపోవచ్చని, వైఎస్ఆర్సీపీ కండువాను కప్పుకోవడం లాంఛనప్రాయమేననే ప్రచారం జోరుగా సాగుతోంది. తన రిటైర్‌మెంట్‌ను ప్రకటిస్తూ ఈ సాయంత్రం తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన సమాచారాన్ని నో యూటర్న్ అంటూ ముగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అప్పుడే సెటైర్లు సంధించడం మొదలుపెట్టినట్టయిందంటూ నెటిజన్లు స్పందిస్తోన్నారు.












Click it and Unblock the Notifications