వరుణుడి చేతిలో ధోనీ సేన తలరాత: ఎన్ని ఓవర్లకు ఎన్ని పరుగులు చేయాలంటే..?
అహ్మదాబాద్: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్స్‌లో గుజరాత్ టైటాన్స్ మెరుపులు మెరిపించింది. స్టేడియంలో పరుగుల వరద పారించింది. ఊహించినట్టే భారీ స్కోర్‌ను సాధించింది. ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ల తుక్కు రేగ్గొట్టారు బ్యాటర్లు. ప్రత్యేకించి- ఫస్ట్ డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ అదరగొట్టాడు.
టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్ ఆరంభించింది. తన నిర్ణయం తప్పు అని తెలుసుకోవడానికి ధోనీకి ఎంతో సమయం పట్టలేదు. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్ శుభారంభాన్ని ఇచ్చారు. ప్రారంభ ఓవర్లల్లో వారిద్దరూ ధాటిగా ఆడారు. చెన్నై బౌలర్లను దడదడలాడించారు.

వారిద్దరూ అవుట్ అయిన తరువాత కూడా గుజరాత్ ఇన్నింగ్ దూకుడుకు బ్రేకులు పడలేదు. నిర్ణీత 20 ఓవర్లల్లో 214 పరుగులు చేసిందా లోకల్ టీమ్. ఈ క్రమంలో నాలుగు వికెట్లను నష్టపోయింది. ఫస్ట్ డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ విజృంభించాడీ మ్యాచ్‌లో. తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. చివరి ఓవర్‌లో 96 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్- 39, వృద్ధిమాన్ సాహా- 54 చేశారు. కేప్టెన్ హార్దిక్ పాండ్యా- 21 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు వర్షం స్వాగతం పలికింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే క్రీజ్‌లోకి దిగిన కొద్దిసేపటికే వర్షం పడింది. మహ్మద్ షమీ వేసిన తొలి ఓవర్ రెండు బంతులు డాట్స్‌గా పడ్డాయి. మూడో బంతిని రుతురాజ్ గైక్వాడ్ బౌండరీకి తరలించాడు. ఆ వెంటనే భారీ వర్షం కురిసింది. దీనితో మ్యాచ్‌ను నిలిపివేశారు. పిచ్‌ను కవర్లతో కప్పివేశారు.
ప్రస్తుతం వర్షం నిలిచిపోయినప్పటికీ.. అవుట్ ఫీల్డ్ మొత్తం బురదమయం కావడం వల్ల దాన్ని ఆరబెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు గ్రౌండ్ స్టాఫ్.ఇక డక్‌వర్త్ లూయిస్ సిస్టమ్ మీద చెన్నై సూపర్ కింగ్స్ విజయం ఆధారపడింది. వర్షం వల్ల ఓవర్లను కుదించాల్సిన పరిస్థితి వస్తే- 18 ఓవర్లల్లో 198, 15 ఓవర్లల్లో- 171, 12 ఓవర్లల్లో 143, 10 ఓవర్లల్లో 123, ఎనిమిది ఓవర్లల్లో- 101, అయిదు ఓవర్లల్లో 66 పరుగులను చేయాల్సి ఉంటుంది ధోనీ సేనకు.












Click it and Unblock the Notifications