ధోనీ సేనకు నిరాశ: కప్- గుజరాత్ టైటాన్స్‌దే: అలా జరక్కూడదంటూ పూజలు..!!
అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఒక్క బంతి కూడా పడలేదు. సూపర్ ఓవర్ సమయం కూడా దాటిపోయినప్పటికీ- వర్షం తెరిపినివ్వలేదు. ఫలితంగా ఇవ్వాళ్టికి మ్యాచ్ వాయిదా పడింది. ఆదివారం సాయంత్రం జరగాల్సిన మ్యాచ్.. ఈ సాయంత్రం 7:30కు మొదలవుతుంది.
తొలుత కొన్ని నిమిషాల పాటు వర్షం ఆగిపోవడంతో మ్యాచ్‌ను అయిదు ఓవర్ల పాటు కుదించారు. కటాఫ్ టైమ్‌ను అర్ధరాత్రి 12:06 నిమిషాలుగా నిర్ధారించారు. ఆ సమయానికి వర్షం ఆగిపోతే సూపర్ ఓవర్ ద్వారా విజేతను ప్రకటించాలని నిర్ణయించారు. 15 నిమిషాల పాటు స్తంభించిన వర్షం.. మళ్లీ అందుకుంది. దీనితో మ్యాచ్‌ను రద్దు చేశారు. సోమవారం రిజర్వ్ డే కావడం వల్ల ఈ సాయంత్రం 7:30 గంటలకు రీషెడ్యూల్ చేశారు.

మ్యాచ్ ఆరంభం కావడానికి అరగంట ముందు నుంచే అహ్మదాబాద్‌లో భారీ వర్షం ఆరంభమైంది. అప్పటి వరకు ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బలమైన ఈదురుగాలులు వీచాయి. ఉరుములు మెరుపులతో వర్షం దంచి కొట్టింది. కొన్ని గంటల పాటు వర్షం తీవ్రత కొనసాగింది. పిచ్‌పై కవర్లు మూసివుంచినప్పటికీ- అవుట్ ఫీల్డ్ మొత్తం బురదమయమైంది. స్టేడియం బయట అడుగు లోతు నీళ్లు పారాయంటే వర్షం ఏ స్థాయిలో పడిందో అర్థం చేసుకోవచ్చు.
ఇవ్వాళ వర్షం పడే అవకాశాలు లేవని అక్యూట్ వెదర్ తెలిపింది. మధ్యాహ్నం వరకు ఎండ ఉన్నప్పటికీ.. ఆ తరువాత వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవచ్చని, సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో మబ్బులు కమ్ముకున్నప్పటికీ వర్షం పడకపోవచ్చని అంచనా వేసింది. పగటి ఉష్ణోగ్రత గరిష్ఠంగా 39 డిగ్రీల వరకు నమోదవుతుందని అక్యూట్ వెదర్ అభిప్రాయపడింది.
ఆదివారం తరహాలో అహ్మదాబాద్‌లో ఈ సాయంత్రం కూడా భారీ వర్షం పడి- రిజర్వ్ డే కూడా నీటిపాలయిందంటే మాత్రం చెన్నై సూపర్ కింగ్స్‌కు నిరాశ తప్పదు. మ్యాచ్ పూర్తిగా రద్దయితే గుజరాత్ టైటాన్స్‌ను ఛాంపియన్‌గా ప్రకటిస్తారు. పాయింట్ల పట్టిక ఆధారంగా ఆ జట్టును విజేతగా నిర్ణయిస్తారు. పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ టాప్ పొజీషన్‌లో ఉన్న విషయం తెలిసిందే.
ఐపీఎల్ లీగ్ దశలో అత్యధిక విజయాలను సొంతం చేసుకున్న జట్టు గుజరాత్ టైటాన్స్. 14 లీగ్ మ్యాచ్‌లల్లో పదింట్లో విజయం సాధించింది. 20 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఎనిమిది విజయాలతో చెన్నైసూపర్ కింగ్స్ రెండో స్థానంలో ఉంది. 17 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉన్నాయి. రిజర్వ్ డే కూడా రద్దయిందంటే ఈ పాయింట్లే ఇప్పుడు కీలకంగా మారుతాయి. దీని ఆధారంగా చేసుకుని గుజరాత్ టైటాన్స్‌ను విజేతగా ప్రకటిస్తారు. అలా జరక్కూడదంటూ ధోనీ ఫ్యాన్స్ పూజలు చేస్తోన్నారు.












Click it and Unblock the Notifications