కోల్‌కత నైట్ రైడర్స్ సంచలనం- కొత్త కేప్టెన్‌గా..!!
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 టోర్నమెంట్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ జట్టుకు కొత్త సారథి వచ్చాడు. రెగ్యులర్ కేప్టెన్ శ్రేయాస్ అయ్యర్ స్థానంలో మరో సీనియర్ బ్యాటర్‌కు సారథ్య బాధ్యతలను అప్పగించింది కేకేఆర్ ఫ్రాంఛైజీ. బ్యాక్ పెయిన్‌తో బాధపడుతున్న శ్రేయాస్ అయ్యర్- ఈ సీజన్ ఫస్ట్ హాఫ్‌కు దూరం అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కొద్ది సేపటి కిందటే కొత్త కేప్టెన్ పేరును ప్రకటించింది.
నితీష్ రాణా (Nitish Rana)ను కొత్త కేప్టెన్‌గా ప్రకటించింది కోల్‌కత నైట్ రైడర్స్ మేనేజ్‌మెంట్. ఈ సీజన్ మొత్తానికీ జట్టుకు అతనే నాయకత్వాన్ని వహిస్తాడని తెలిపింది. పూర్తి ఫిట్‌నెస్‌ను సాధించిన అనంతరం ఈ సీజన్ మధ్యలో శ్రేయాస్ అయ్యర్ గనక జట్టుకు అందుబాటులోకి వస్తే- అప్పటి పరిస్థితులు, జయాపజయాలను పరిగణనలోకి తీసుకుని కేప్టెన్సీలో మార్పులు చేర్పులు చేసే అవకాశాలు లేకపోలేదు. అప్పటివరకు జట్టు పగ్గాలు నితీష్ రాణా చేతుల్లో ఉంటాయి.

కేప్టెన్సీ బాధ్యతలు నితీష్ రాణాకు కొత్తేమీ కాదు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఢిల్లీ జట్టుకు అతను కేప్టెన్‌గా వ్యవహరించాడు. అతని నాయకత్వంలో ఆ టీమ్- ఎనిమిది విజయాలను సాధించిన విషయం తెలిసిందే. 29 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండెడ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ 2016లో ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు 91 మ్యాచ్‌లను ఆడాడు. 134.22 స్ట్రైక్ రేట్‌తో 2,181 పరుగులు చేశాడు. అతని వ్యక్తిగత అత్యధిక స్కోర్ 87 పరుగులు. 28.32 బ్యాటింగ్ సగటుతో నిలకడగా రాణిస్తోన్నాడు. నితీష్ రాణా ఖాతాలో 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఐపీఎల్ 2023 ముగిసే నాటికి శ్రేయాస్ అయ్యర్ కోలుకుంటాడని ఆశిస్తోంది కోల్‌కత నైట్ రైడర్స్ మేనేజ్‌మెంట్. నితీష్ రాణా చేతికి కేప్టెన్సీ పగ్గాలు వెళ్లడ.. ఎంత వరకు సత్ఫలితాలను ఇస్తుందనేది ఉత్కంఠతను రేపుతోంది. ఏప్రిల్ 1వ తేదీన కోల్‌కత్ నైట్ రైడర్స్ తన తొలి మ్యాచ్ ఆడబోతోంది. పంజాబ్ కింగ్స్ ను ఢీ కొట్టనుంది. మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. పంజాబ్ కింగ్స్ కు ఓపెనర్ శిఖర్ ధావన్ కేప్టెన్‌గా వ్యవహరిస్తోన్నాడు.
ఇద్దరు టాప్ బౌలర్లు శార్దుల్ ఠాకూర్, సునీల్ నరైన్ పేర్లు మొదట్లో వినిపించినప్పటికీ- అనూహ్యంగా నితీష్ రాణా పేరును తెర మీదికి తీసుకొచ్చింది కేకేఆర్. సునీల్ నరైన్ ఇటీవలే ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో అబుదాబి నైట్ రైడర్స్ కు నాయకత్వాన్ని వహించాడు. ఆశించిన స్థాయిలో విజయాలను అందించలేకపోయాడతను. తొమ్మిది మ్యాచ్ లల్లో అబుధాబి నైట్ రైడర్స్ గెలిచింది ఒక్కటే. ఆరు జట్లు పాల్గొన్న ఆ టోర్నమెంట్ లో చివరి స్థానంలో నిలిచిందా జట్టు.












Click it and Unblock the Notifications