ఓటు వేసిన వైఎస్ జగన్: సడలని ధీమా
YS Jagan Mohan Reddy: ఏపీలో పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు రాష్ట్రంలో గల 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ మొదలైంది. సాయంత్రం వరకు కొనసాగుతుంది. తొలి గంటలోనే పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల, కేంద్ర ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను పూర్తి చేశారు. పోలింగ్ స్టేషన్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండటానికి అవసరమైన అన్ని చర్యలను యుద్ధ ప్రాతిపదికన తీసుకున్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని భాకరాపురంలో ఆయన ఓటు వేశారు. ఇక్కడి జయ మహల్ ప్రాంతంలో గల ఆంగన్వాడి పోలింగ్ బూత్ నంబర్ 138లో ఆయన కొద్దిసేపటి కిందటే ఓటు వేశారు.
అనంతరం తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు వైఎస్ జగన్. తన అయిదు సంవత్సరాల పరిపాలనలో లబ్ది పొందిన ప్రతి ఒక్కరూ తమ పార్టీకి అనుకూలంగా ఓటు వేస్తారని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం వల్ల లబ్ది పొందితేనే ఓటు వేయాలంటూ ఎన్నికల్లో ప్రచారం చేశామని గుర్తు చేశారు.
అయిదు సంవత్సరాల పాలన నచ్చితేనే ఓటు వేయాలని ఆయన పునరుద్ఘాటించారు. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం ఓటర్లు నేడు తమ తీర్పును ఇవ్వబోతోన్నారని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వ పనితీరును ఓటర్ల తీర్పే గీటురాయి అవుతుందని ఆయన పేర్కొన్నారు. మరోసారి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమనే ధీమాను వ్యక్తం చేశారు వైఎస్ జగన్.












Click it and Unblock the Notifications