ధర్మపురి ఎన్నికల స్ట్రాంగ్ రూం తాళం చెవి మాయంపై ఈసీ విచారణ: ప్రత్యేక అధికారి
కరీంనగర్: జగిత్యాల జిల్లా ధర్మపురి ఎన్నికల స్ట్రాంగ్ రూం తాళం చెవి మాయంపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కొండగట్టు జేఎన్టీయూలో సోమవారం ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఈ వ్యవహారంపై విచారణ జరపనున్నారు. ఈ ఘటనకు సంబంధించి 2018లో పనిచేసిన ఎన్నికల అధికారులను కూడా విచారించనున్నారు.
విచారణకు రావాలని అప్పటి ఎన్నికల అధికారులకు ఈసీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. 2018 ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. స్ట్రాంగ్ రూం తెరవాలని అధికారులను ఆదేశించింది. ఈ క్రమంలో ఏప్రిల్ 10న జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంను జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా సమక్షంలో తెరిచేందుకు ఏర్పాట్లు చేశారు.

అయితే స్ట్రాంగ్ రూంల తాళం చెవులు దొరకలేదు. మడు గదుళ్లో రెండో గది తాళం తెరచురుకోవడంతో అందులో పరిశీలించి వీడియో చిత్రీకరించారు. మిగితా రెండు గదుల తాళాలు దొరక్కపోవడంతో మరమ్మతులు చేసే వ్యక్తిని పిలిపించడం లేదా తాళం పగలగొట్టాలని భావించారు. ఇందుకు కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ అంగీకరించలేదు. దీంతో తెరిచిన గదితోపాటు మిగితా రెండు గదులకు అధికారులు సీల్ వేశారు.
కాగా, తెరుచుకున్న గదిలో 108 నుంచి 269 పోలింగ్ కేంద్రాల ఈవీఎంలు భద్రంగా ఉన్నాయి. మిగితా రెండు గదుల తాళాలు తరచుకోలేదు. దీనిపై జిల్లా కలెక్టర్ కోర్టుకు నివేదించారు. స్పందించిన హైకోర్టు.. కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రంగంలోకి దిగారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక అధికారిని నియమించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications