IPL 2023 Playoffs : చెన్నైలో ధోనీ మేనియా- గుజరాత్ పై గెలిచి ఫైనల్ కు తీసుకెళ్తాడనే అంచనాలు..
ఐపీఎల్ 2023లో లీగ్ దశ మ్యాచ్ లు ముగిశాయి. దీంతో ప్లే ఆఫ్స్ దశలో ఆడేందుకు నాలుగు జట్లు సిద్దమయ్యాయి. ప్లే ఆఫ్స్ పేరులో భాగంగా చెన్నైలోనే తొలి క్వాలిఫయర్ తో పాటు ఎలిమినేటర్ మ్యాచ్ కూడా జరగబోతోంది. దీంతో ప్లేఆఫ్స్ కు ఆతిధ్యమిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ సొంత గ్రౌండ్ చెన్నైలో ఇప్పుడు ఎక్కడ చూసినా ధోనీ మేనియా కనిపిస్తోంది. అభిమానులు ధోనీ పేరే జపిస్తున్నారు. సొంత గ్రౌండ్ లో ధోనీ చెలరేగితే సీఎస్కే ఫైనల్ చేరడం ఖాయమనే అంచనాలున్నాయి.
రేపు సాయంత్రం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్డేడియంలో జరిగే తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ను స్ధానిక జట్టు చెన్నై సూపర్ కింగ్స్ ఎదుర్కోబోతోంది. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ధోనీ పేరే వినిపిస్తోంది. ధోనీ సేన ఈ మ్యాచ్ లో గెలిస్తే నేరుగా ఫైనల్ కు చేరుకునే అవకాశం ఉండటంతో ఈ మ్యాచ్ పై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. అదీ డిఫెండింగ్ ఛాంపియన్ అయిన గుజరాత్ పై సొంత మైదానంలో గెలిస్తే ఆ కిక్కే వేరనే ప్రచారం జరుగుతోంది.

రేపు చెన్నై, గుజరాత్ జట్ల మధ్య జరిగే క్వాలిఫయర్ మ్యాచ్ టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడుపోయాయి. గుజరాత్ తో జరిగే పోరులో ఎంఎస్ ధోనీ బ్యాట్ తోనే కాకుండా జట్టు కెప్టెన్ గా తన మెరుపు వ్యూహాలతో తమ జట్టును ఫైనల్లోకి తీసుకెళ్తాడని అభిమానులు భారీి అంచనాలు పెట్టుకున్నారు. నాలుగు సార్లు ఛాంపియన్ అయిన చెన్నై జట్టు.. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఫైనల్ కు వెళ్లడంతో పాటు గుజరాత్ కంటే తక్కువ ప్రదర్శన చేసిన ముంబై, లక్నో వంటి జట్లను ఎదుర్కొంటుంది. అప్పుడు మరోసారి టైటిల్ గెలవడం ఖాయమన్న అంచనాలున్నాయి.
ఈసారి ఐపీఎల్ గెలిస్తే ధోనీ రిటైర్మెంట్ కూడా అయ్యే అవకాశాలు ఉండటంతో ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానులు భారీగా ఎగబడుతున్నారు. అదీ సొంత మైదానంలో అయితే ధోనీ సేన ప్రదర్శన మెరుగ్గా ఉంటుందన్న అంచనాలు ఎలాగో ఉన్నాయి. దీంతో పాటు ప్రత్యర్ధిగా డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ ఉండటంతో ఈ అంచనాలు మరింత పెరిగిపోయాయి. దీంతో ఈ ఒత్తిడంతా ధోనీపైనే పడుతోంది.












Click it and Unblock the Notifications