కారు గెలుపా, కాంగ్రెస్ విజయమా.. ఉప ఎన్నిక ప్రశాంతం.. ఇక ఫలితాలపై ఉత్కంఠ..!
నల్గొండ : హుజుర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోరు ముగిసింది. ఇక తేలాల్సింది ఫలితాలే. ఓటర్ల నాడి నిక్షిప్తమైన ఈవీఎంలు.. బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నాయి. సోమవారం నాడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో ఎన్నికల అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. 302 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఓటింగ్ కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ. ఎన్నికల తంతు ముగియడంతో ఇక ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే పోటీ కనిపిస్తున్నా.. ఎవరిది గెలుపనే విషయంలో మరో మూడు రోజులు ఆగాల్సిందే.

టీఆర్ఎస్, కాంగ్రెస్ టఫ్ ఫైట్?.. ఇండిపెండెంట్లు దెబ్బ కొట్టేనా?
నల్గొండ ఎంపీగా విజయం సాధించడంతో హుజుర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. దాంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి పోటీ చేయగా.. టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి బరిలో నిలిచారు. ఇక టీడీపీ, బీజేపీతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు పోటీకి సై అన్నారు. దాంతో ఉప పోరులో 28 మంది అభ్యర్థులు నిలిచినట్లైంది. సోమవారం (21.10.2019) నాడు ఎన్నికల తంతు కూడా ముగియడంతో ఇక గెలుపు గుర్రం ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

పోలింగ్ ముగిసే సమయానికి..!
ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ దాదాపు రెండు గంటల వరకు మందకొడిగా సాగిందని చెప్పొచ్చు. 9 గంటల సమయంలో పోలింగ్ పర్సంటేజీ అతి తక్కువగా కనిపించింది. కేవలం 13.44 శాతం మాత్రమే నమోదైంది. ఆ తర్వాత రెండు గంటల వ్యవధిలో అంటే ఉదయం 11 గంటల సమయానికి 31.34 శాతానికి చేరుకుంది. అలా నెమ్మదిగా పెరుగుతూ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఏకంగా 52.89 శాతం నమోదైంది. అలాగే మధ్యాహ్నం 3 గంటల సమయంలో 69.95 శాతం రికార్డైంది.సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లో నిల్చున్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. ఓటింగ్ ముగిసే సమయానికి అంటే సాయంత్రం 5 గంటల వరకు 85 శాతం పోలింగ్ నమోదైంది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో 88 శాతం పోలింగ్ రికార్డైంది.

అక్కడక్కడ తప్పని ఇబ్బందులు.. అయినా పోలింగ్ ప్రశాంతం
ఉప ఎన్నిక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పర్యవేక్షించారు. మరోవైపు పోలీస్ శాఖ భారీ బందోబస్తు చేపట్టింది. మొత్తం 2,350 మంది పోలీస్ సిబ్బంది ఎన్నికల విధి నిర్వహణలో పాల్గొన్నారు. 6 కంపెనీల కేంద్ర బలగాలు, 5 కంపెనీల తెలంగాణ స్పెషల్ పోలీస్, 27 రూట్ మొబైల్స్, 7 క్విక్ రియాక్షన్ టీమ్స్, 10 స్పెషల్ పార్టీలు, డాగ్ స్క్వాడ్స్, ఆయా జిల్లాల నుంచి అదనపు సిబ్బంది, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు.
నేరేడుచర్ల మండలంలోని చింతబండ గ్రామంలో రెండు ఈవీఎంలు మొరాయించినట్లు సమాచారం. దాంతో కొద్దిసేపు ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. వాటిని సరిచేసిన తర్వాత తిరిగి పోలింగ్ యథావిధిగా కొనసాగింది. అదలావుంటే చింతకుంట్లలోని ఓ పోలింగ్ కేంద్రంలో వెలుతురు సరిగా లేకపోవడంతో ఓటర్లు నానా తిప్పలు పడ్డారు. పార్టీ సింబల్స్ గుర్తించే వీలు లేకుండా పోయిందని వాపోయారు.

అధికారులతో పద్మావతి వాగ్వాదం.. గో బ్యాక్ అంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు..!
పోలింగ్ సరళిని పరిశీలించడానికి వెళ్లిన సందర్భంలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు. చింతలపాలెం మండలం కృష్ణాపురంలోని ఓ పోలింగ్ కేంద్రం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. అధికారుల సమన్వయం లోపం వల్ల ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారని అధికారులను నిలదీసే క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే అక్కడే ఉన్న టీఆర్ఎస్ శ్రేణులు.. పద్మావతి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దాంతో అక్కడ కొద్దిసేపు టెన్షన్ వాతావరణం కనిపించింది. ఆ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టాల్సి వచ్చింది.












Click it and Unblock the Notifications