నెల్లూరులో హై టెన్షన్: అనిల్ సభ, కాకాణి బైక్ ర్యాలీ.. 1000 మంది పోలీసులతో బందోబస్త్
ఇటీవలే ఏపీ మంత్రివర్గం కొలువుదీరింది. అసంతృప్తుల బెడద ఉండనే ఉంటుంది. కానీ వారందరికీ సీఎం జగన్ సర్దిచెప్పారు. వారంతా కూడా అప్పటి వరకు ఓకే అని తల ఊపారు. ఇప్పుడు జిల్లాల వంతు వచ్చింది. ఇంకేముంది.. గ్రూపులు, వర్గ విభేదాలు మెల్లగా బయటకు వస్తున్నాయి. ఇందులో నెల్లూరు జిల్లా ముందువరసలో ఉంది. అనిల్ కుమార్ యాదవ్ మంత్రి పదవీ ఊడగా.. కాకాణి గోవర్ధన్ రెడ్డికి పదవీ లభించింది.
ఇప్పటివరకు ఓకే కానీ.. వారిద్దరూ నెల్లూరు కేంద్రంగా ఆదివారం సభ, ర్యాలీలు చేయడం చర్చానీయాంశం అయ్యింది. వారిద్దరికీ ఇప్పటికే హై కమాండ్ స్పష్టమైన ఆదేశాలు కూడా జారీచేసింది. కానీ మంత్రి అయిన తర్వాత కాకాణి గోవర్ధన్ రెడ్డి తొలిసారి నెల్లూరు వస్తున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో సభ ఏర్పాటు చేశారు. గాంధీ బొమ్మ సెంటర్‌లో అనిల్ సభ జరుగుతుంది.

మంత్రి కాకాణి కావలి చేరుకున్నారు. అక్కడినుంచి నెల్లూరు వైసీపీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. కోవూరు, పడుగుపాడు, ఆత్మకూరు బస్టాండు మీదుగా బైక్ ర్యాలీ కొనసాగనుంది. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. వీరి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ 1000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నెల్లూరు వైసీపీ రాజకీయాలపై హైకమాండ్ ఫోకస్ చేసింది. పార్టీ పెద్దలు అటు మంత్రి కాకాణితో, ఇటు మాజీమంత్రి అనిల్ తోనూ మాట్లాడినట్టు సమాచారం. వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని ఇరువురికి స్పష్టం చేసినట్టు తెలిసింది.
అయినప్పటికీ ఇద్దరూ ఏం చేస్తారోననే ఉత్కంఠ నెలకొంది. వారు చేసే కామెంట్లతో దుమారం చెలరేగే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే సీఎం జగన్ సహా ముఖ్య నేతలు అంతా.. కూల్‌గా ఉండాలని చెప్పారు. మరీ వారిద్దరూ ఏం చేస్తారో చూడాలీ మరీ.












Click it and Unblock the Notifications