క్రికెట్ ఆడుతూ గొడవపడ్డారు: బాలుడిని తీవ్రంగా కొట్టడంతో మృతి
నెల్లూరు: క్రికెట్ ఆటలో జరిగిన ఘర్షణ ఓ బాలుడి ప్రాణం తీసింది. నెల్లూరు జాకీర్ హుస్సేన్ నగర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతున్న సమయంలో ఇద్దరు పిల్లల మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలో ఓ బాలుడు మరో బాలుడిని కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు.
గొంతు, గుండెపై గట్టిగా కొట్టడంతో బాలుడు కుప్పకూలిపోయాడు. స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. బాలుడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆటకు వెళ్లిన బాలుడు విగతజీవిగా మారడంతో అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

మహిళ దారుణ హత్య
కృష్ణా జిల్లా గుడివాడలోని ఎన్టీఆర్ కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో మహిళ హత్యకు గురైంది. ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యనారాయణ అనే వ్యక్తి భార్య రామలక్ష్మిను కత్తితో విచక్షణా రహితంగా పొడిచి చంపాడు. సూర్యనారాయణను అడ్డుకుపోయిన రామలక్ష్మి తండ్రి వెంకన్నను గాయపరిచాడు. భీమవరానికి చెందిన సూర్యనారాయణతో, రామలక్ష్మికు ఐదేళ్ల క్రితం వివాహమైంది. భర్తతో విభేదాలు కారణంగా నాలుగేళ్ల కుమారుడుతో కలిసి ఎన్టీఆర్ కాలనీలోని పుట్టింట్లో రామలక్ష్మి ఉంటుంది.
పెద్ద మనుషుల సమక్షంలో వివాదాన్ని పరిష్కరించుకుందామని గుడివాడ రావాల్సిందిగా రామలక్ష్మి కుటుంబ సభ్యులు సూర్యనారాయణకు కబురు పంపారు. ఈ క్రమంలో ఇంట్లో పనులు చేసుకుంటున్న రామలక్ష్మిని భర్త సూర్యనారాయణ విచక్షణా రహితంగా పొడిచాడు. దీంతో ఆమె ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఇక, అడ్డుకోబోయిన రామలక్ష్మి తండ్రి వెంకన్నను కూడా సూర్యనారాయణ గాయపరిచాడు. ప్రస్తుతం రామలక్ష్మి తండ్రి వెంకన్న కత్తిపోట్లతో గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సూర్యనారాయణ పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications