ఆర్మీ జవాన్ మిస్సింగ్.. 10 రోజుల నుంచి తెలియని జాడ..
ఓ ఆర్మీ జవాన్ కనిపించకుండ పోవడం కలకలం రేపుతోంది. కామారెడ్డి జిల్లా తిమ్మక్ పల్లికి చెందిన ఆర్మీ జవాన్ కెంగర్ల నవీన్ కుమార్ కనిపించడం లేదు. నవీన్ కుమార్ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఆర్మీ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే గత నెల 4న సెలవుపై ఇంటికి వచ్చాడు. 25 రోజులపాటు ఇంటి దగ్గర కుటుంబ సభ్యులతో గడిపాడు. 29వ తేదీ తిరిగి విధుల్లో చేరేందుకు బయలుదేరాడు.
కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్లడానికి నవీన్ కుమార్ రాత్రి బస్సు ఎక్కాడు. తెల్లవారుఝూము నుంచి అతని ఫోన్ స్విచాఫ్ ఉండడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయమై ఆర్మీ అధికారులకు ఫోన్ చేసి నవీన్ వచ్చాడా లేదా అని ఆరా తీశారు. అయితే ఆర్మీ అధికారులు నవీన్ కుమార్ చేరుకోలేదని సమాధానం రావడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది.

నవీన్ ఫోన్ స్విచాఫ్ చేసి ఉండడంతో ఎక్కడికైనా వెళ్లి ఉంటాడేమో అని స్నేహితులు, బంధువులకు ఫోన్ చేసి వాళ్ళ దగ్గరికి వచ్చి ఉన్నాడేమోనని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎక్కడా కూడా రాలేదని సమాధానం రావడంతో ఈ నెల 4న కుటుంబ సభ్యులు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పట్టణ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. జవాన్ నవీన్ అదృశ్యంతో తిమ్మక్ పల్లి గ్రామంలో ఆందోళన నెలకొంది.
నవీన్ మొబైల్ సిగ్నల్ ఆధారంగా విచారణ చేపడితే అతని ఆచూకీ తెలిసే అవకాశం ఉంది. అయితే అతను వెళ్లి.. పది రోజుల వరకు కావడం, ఇప్పటికీ ఆచూకీ తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అతను క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని శతకోటి దేవుళ్లను ఆ గ్రామం గ్రామమే కొలుస్తోంది. ఆ జవాను తిరిగి క్షేమంగా రావాలని మనము కోరుకుందాం.












Click it and Unblock the Notifications