50 మంది ఉద్యోగులకు కరోనా వచ్చినా 24X7 పనిచేస్తున్నాం: భారత్ బయోటెక్ సుచిత్ర ఎల్లా
హైదరాబాద్: కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కొనుగొని మనదేశంతోపాటు ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్న హైదరాబాద్ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ సంస్థలోనూ కరోనా కలకలం సృష్టిస్తోంది. తమ సంస్థలోని 50 మంది ఉద్యోగులు కరోనా బారినపడ్డారని భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

కోవాగ్జిన్ ఉత్పత్తి కోసం 24x7 పనిచేస్తున్నాం..
కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ తయారీ, సరఫరాపై కొందరు రాజకీయ నాయకులు విమర్శలు చేయడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. తమ సంస్థలోని 50 మంది ఉద్యోగులు కరోనా బారినపడి విధులకు గైర్హాజరవుతున్నప్పటికీ.. లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ.. తాము కోవాగ్జిన్ ఉత్పత్తిని 24x7 కొనసాగిస్తున్నామని, దాన్ని అర్థం చేసుకోకుండా విమర్శలు చేయడం తమను ఎంతగానో బాధిస్తోందని సుచిత్ర ఎల్లా అన్నారు.

ధన్యవాదాలంటూ సుచిత్ర ఎల్లాకు నెటిజన్లు..
సుచిత ఎల్లా ట్వీట్‌కు వేలాది మంది లైక్స్ కొట్టారు, రీట్వీట్ చేశారు. కరోనా కష్టకాలంలో వ్యాక్సిన్ అందిస్తూ సేవలందిస్తున్నందుకు మీకు ధన్యవాదాలంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు. మీరు మా అందరి కోసం ఎంతో శ్రమిస్తున్నారంటూ మరికొందరు అన్నారు. కోవాగ్జిన్ దేశంలోని అన్ని రాష్ట్రాలకు చేరుతోందన్నారు.

అలా ఎందుకు? సుచిత్ర ఎల్లాకు నెటిజన్ల ప్రశ్నలు..
అయితే, సుచిత్ర ట్వీట్‌కు స్పందిస్తూ పలువురు నెటిజన్లు కొన్ని ప్రశ్నలు సంధించారు. 50 మంది ఉద్యోగులు కరోనా బారిన ఎలా పడ్డారు? వారంతా వ్యాక్సిన్ వేసుకోలేదా? మీరెందుకు తాత్కాలికంగా సిబ్బందిని పెంచుకోవడం లేదు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. మీ సంస్థ ఉద్యోగులే కరోనా బారినపడితే మీ వ్యాక్సిన్ సమర్థ్యాన్ని అర్థం చేసుకోవచ్చని అంటున్నారు.

దేశంలోని 18 రాష్ట్రాలకు కరోనా కోవాగ్జిన్ టీకాలు..
కాగా, దేశంలో 18 రాష్ట్రాలో కోవాగ్జిన్ ఇప్పటికే సరఫరా చేశామని చెప్పారు సుచిత్ర ఎల్లా. ఆంధ్రప్రదేశ్, హర్యానా, ఒడిశా, అస్సాం, జమ్మూకాశ్మీర్, తమిళనాడు, బీహార్, జార్ఖండ్, ఢిల్లీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, త్రిపుర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు కరోనా వ్యాక్సిన్లు అందించామని సుచిత్ర వెల్లడించారు. కాగా, కోవాగ్జిన్ వ్యాక్సిన్ మనదేశంతోపాటు విదేశాలకు కూడా అందిస్తున్నారు. ప్రస్తుతం మనదేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అధిక వ్యాక్సిన్లను ఇక్కడే సరఫరా చేస్తున్నారు.












Click it and Unblock the Notifications