తెలంగాణలో అంతకంతకూ కరోనా తీవ్రత: డిశ్చార్జిలు, టెస్టింగుల్లో కొత్త మార్క్..కోటి ప్లస్
హైదరాబాద్: తెలంగాణలో అంతకంతకూ కరోనా వైరస్ కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రోజువారీ కేసుల్లో అనూహ్య పెరుగుదల నమోదవుతోంది. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయంలో అర్చకుడితో సహా 32 మంది ఆలయ ఉద్యోగులు, సిబ్బందికి కరోనా వైరస్ సోకడం.. పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కరోనా యాక్టివ్ కేసులు ఇదివరకట్లా ఎగబాకుతున్నాయి. నాలుగున్నర వేలకు చేరువ అయ్యాయి. ఈ పరిణామాల మధ్య డిశ్చార్జీల సంఖ్య గణనీయంగా మెరుగుపడటం ఊరట కలిగిస్తోంది. ఇప్పటిదాకా మూడు లక్షల మందికి పైగా పేషెంట్లు కరోనా నుంచి కోలుకున్నారు.
తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 535 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ముగ్గురు మరణించారు. 278 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,06,339కి చేరుకుంది. ఇందులో సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని, ఇళ్లకు వెళ్లిన వారు 3,00,156 మంది ఉన్నారు. 1,688 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్‌గా ఉన్న కేసులు నాలుగున్నర వేలకు చేరువ అయ్యాయి. తాజా బులెటిన్ ప్రకారం.. 4,495 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి. గృహాలు, ఇన్‌స్టిట్యూషనల్ ఐసొలేషన్‌లో 1,979 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా తీవ్రత ఏ మాత్రం తగ్గట్లేదు. కొత్తగా 154 కేసులు నమోదయ్యాయి. ఆదిలాబాద్-11, భద్రాద్రి కొత్తగూడెం-5, జగిత్యాల-15, జనగామ-5, జయశంకర్ భూపాలపల్లి-6, జోగుళాంబ గద్వాల-4, కామారెడ్డి-8, కరీంనగర్-15, ఖమ్మం-16, కొమరం భీమ్ ఆసిఫాబాద్-5, మహబూబ్‌నగర్-21, మహబూబాబాద్-3, మంచిర్యాల-9, మెదక్-6, మేడ్చల్ మల్కాజ్‌గిరి-49, ములుగు-1, నాగర్ కర్నూల్-7, నల్లగొండ-11, నారాయణ్‌పేట్-1, నిర్మల్-11, నిజామాబాద్-32, పెద్దపల్లి-6, రాజన్న సిరిసిల్ల-7, రంగారెడ్డి-39, సంగారెడ్డి-22, సిద్ధిపేట్-8, సూర్యాపేట్-9, వికారాబాాద్-6, వనపర్తి-7, వరంగల్ రూరల్-6, వరంగల్ అర్బన్-11, యాదాద్రి భువనగిరి-19 కేసులు నమోదు అయ్యాయి.
తెలంగాణ వ్యాప్తంగా 24 గంటల్లో 57,942 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్‌లో వెల్లడించారు. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించిన పరీక్షలు 49,766 కాగా.. మిగిలినవీ ప్రైవేటు హాస్పిటల్స్‌లో నమోదయ్యాయి. కొత్త వాటితో ఇప్పటిదాకా నిర్వహించిన మొత్తం టెస్టింగుల సంఖ్య 1,00,19,096గా నమోదైంది. సగటున ప్రతి 10 లక్షల జనాభాకు 2,69,185 మంది శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications