తెలంగాణలో 6603 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు: జేపీఎస్‌ల నియామకం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 6603 ఫోర్త్ గ్రేడ్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, రాష్ట్రంలో ఇటీవల క్రమబద్ధీకరించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ఈ పోస్టుల్లో నియమించేందుకు ఆదేశించింది. ఇవి గాక, మరో 3065 పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయని, రానున్న కాలంలో క్రమబద్ధీకరించే కార్యదర్శులను వీటిల్లో నియమించేందుకు వెసులుబాటు కల్పించింది.
జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు నెలకు రూ. 28,719 వేతనం వస్తుండగా.. ఫోర్త్ గ్రేడ్ పంచాయతీ కార్యదర్శులకు వేతన స్కేల్‌ను రూ. 24,280-రూ. 72,850 వర్తింపజేయనుంది. రాష్ట్రంలో 9355 మంది జేపీఎస్ లు పనిచేస్తుండగా, వారిని క్రమబద్ధీకరించి 4 గ్రేడ్ పంచాయతీ కార్యదర్శులుగా మార్చాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.

నాలుగేళ్ల నిరాటంక సర్వీసు, పనితీరు ప్రాతిపదికగా అర్హులను గుర్తించాలని గతంలో కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు జిల్లాల్లో వారి పనితీరును మదింపు చేసి 6616 మందిని క్రమబద్ధీకరణకు అర్హులుగా గుర్తించి వారు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
ఈ క్రమంలో పంచాయతీరాజ్ శాఖ వినతి మేరకు కొత్తగా 6603 ఫోర్త్ గ్రేడ్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను మంజూరు చేసింది. ఇకపై జేపీఎస్‌లు కార్యదర్శి గ్రేడ్ 4 హోదాలో కొనసాగనున్నారు. గ్రామానికో పంచాయతీ కార్యదర్శి లక్ష్యంతో 9 వేలకు పైగా జేపీఎస్ పోస్టులను సీఎం కేసీఆర్ మం జూరు చేశారు. వీరికి పరీక్ష నిర్వహించి అర్హులైన వారిని జేపీఎస్‌లుగా నియమించారు.
మంజూరైన పోస్టుల కంటే 13 మంది అర్హులు ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే శాఖపరంగా ఉన్న 3065 పోస్టుల్లో వారిని సర్దుబాటు చేయాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications