తెలంగాణలో నమోదైన కరోనా కేసుల్లో 95 శాతం డెల్టా వేరియంట్ కేసులే: డెల్టా ప్లస్ ఎఫెక్ట్ తక్కువే
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఒక్కో రోజు స్వల్పంగా కేసులు పెరగడం తగ్గడం జరుగుతోంది. కాగా, తాజాగా, ఓ కీలక విషయం వెల్లడైంది. రాష్ట్రంలో సెకండ్ వేవ్‌లో నమోదైన కరోనా వైరస్ కేసుల్లో అత్యధికంగా డెల్టా రకం కేసులే ఉన్నట్లు తేలింది.

ఏప్రిల్ నుంచి తెలంగాణలో విజృంభించిన డెల్టా వేరియంట్
తెలంగాణలో కరోనా రెండు దశ ప్రారంభం నుంచి నమోదైన కేసుల్లో ఎక్కువ డెల్టా రకానికి చెందినవేనని వైద్య నిపుణులు వెల్లడించారు. వైరస్ జన్యుక్రమాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఈ మేరకు తెలిపారు. జులై, ఆగస్టు నెలల్లో కరోనాను విశ్లేషించినప్పుడు ఈ రకం కేసులు 95 శాతంగా ఉన్నట్లు వెల్లడైంది. ఏప్రిల్ నెలలో నమోదైన కేసుల్లో డెల్టా రకం కేసులు 33 శాతం ఉండగా, మే నెలలో 86 శాతం, జులై 95 శాతానికి పెరిగింది. ఆగస్టులో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా.. నమోదైన కేసుల్లో డెల్టా రకం కేసులే 95 శాతంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో సేకరించిన నమూనాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు దీనికి సంబందించిన సమాచారాన్ని గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ షేరింగ్ ఆల్ ఇన్ ఫ్లూయెంజా డేటా(జీఐఎస్ఏఐడీ) ద్వారా వెల్లడించారు.

తెలంగాణలోని ఈ జిల్లాల్లో డెల్టా వేరియంట్ వ్యాప్తి అత్యధికం
రాష్ట్రంలోని జగిత్యాల, జనగామ, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, నాగర్‌కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వనపర్తి, వరంగల్ నగర జిల్లాల్లో నమోదైన కేసులన్నీ కూడా డెల్టా రకానికి చెందినవేనని తేల్చారు. ఇక హైదరాబాద్ నగర పరిధిలో నమోదైన మొత్తం కేసుల్లో 94 శాతం, జోగులాంబ గద్వాల జిల్లాలో 93 శాతం, సూర్యాపేట జిల్లాలో 86 శాతం డెల్టా రకానివిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. రాష్ట్రంలో కొత్తగా డెల్టా ప్లస్ రకాలు కూడా వెలుగుచూశాయి. ఈ రకం కేసులు ఇప్పటి వరకు రెండు వెలుగుచూసినట్లు వైద్యులు వెల్లడించారు. అయితే, దీని తీవ్రత తక్కువగానే ఉందని వైద్య నిపుణులు తేల్చారు.

తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి..
మరోవైపు తెలంగాణ కరోనా కేసులు తగ్గడం లేదు. గత 24 గంటల్లో 88,164 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 482 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యశాఖ వెల్లడించింది. తాజాగా, నమోదైన 482 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,50,835కు చేరింది. కరోనాతో కొత్తగా ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3833కి చేరింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. కాగా, మరో 1417 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది. గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 455 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,38,865కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,137 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 98.16 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప క్షీణత నమోదైంది.

జిల్లాలవారీగా తగ్గుతున్న కరోనా కేసులు, టెస్టులు కూడా
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 06, భద్రాద్రి కొత్తగూడెంలో 10, జీహెచ్ఎంసీలో 82. జగిత్యాలలో 19, జనగామలో 08, జయశంకర్ భూపాలపల్లిలో 05, జోగులాంబ గద్వాలలో 01, కామారెడ్డిలో 02, కరీంనగర్‌లో 61, ఖమ్మంలో 26, కొమురంభీం ఆసిఫాబాద్ లో 03, మహబూబ్‌నగర్‌లో 05, మహబూబాబాద్‌లో 07, మంచిర్యాలలో 13, మెదక్‌లో 01, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 23, ములుగులో 06, నాగర్ కర్నూలులో 00, నల్గొండలో 35, నారాయణపేటలో 03, నిర్మల్‌లో 05, నిజామాబాద్‌లో 06, పెద్దపల్లిలో 23, రాజన్న సిరిసిల్లలో 13, రంగారెడ్డిలో 25, సంగారెడ్డిలో 06, సిద్దిపేటలో 11, సూర్యాపేటలో 17, వికారాబాద్ లో 01, వనపర్తిలో 04, వరంగల్ రూరల్‌లో 05, వరంగల్ అర్బన్‌లో 41, యాదాద్రి భువనగిరిలో 09 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఒక్క నాగర్‌కర్నూల్ జిల్లాలో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
Recommended Video

తెలంగాణలో విద్యాలయాలు తెరిచేందుకు సానుకూలతలు
విద్యా సంస్థలు తెరిచే విషయంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కీలక సూచనలు చేసింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టినందున..పాఠశాలలు, కాలేజీలు తెరుచుకోవచ్చని, థర్డ్ వేవ్ వచ్చే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదని..ఈ క్రమంలో జాగ్రత్తలు పాటిస్తూ...పాఠశాలలు తెరుచుకోవచ్చని సూచించింది. ఏడాదిన్నరగా స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోకపోవడం వల్ల...విద్యార్థుల్లో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయని విద్యాశాఖాధికారి అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యా కోర్సుల్లో ప్రవేశానికి ప్రమోషన్ విధానానికి నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. దీనివల్ల విద్యార్థుల భవిష్యతపై పెను ప్రభావం చూపెడుతుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని స్కూళ్లు, కాలేజీలు తెరవాలని సూచిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైద్య ఆరోగ్య శాఖ చేసిన సూచనలపై విద్యాశాఖ త్వరలోనే విద్యాలయాల తెరిచే విషయంపై నిర్ణయం తీసుకోనుంది. కాగా, దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు విద్యాలయాలను తెరిచేందుకు కసరత్తులు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఆగస్టు 16 నుంచి పాఠశాలలు, కాలేజీలు తెరిచేందుకు ఇప్పటికే అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోని మిగితా రాష్ట్రాలు కూడా ఆగస్టు 15 నుంచి విద్యాలయాలను తెరిచేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. అయితే, ప్రాథమిక స్థాయి కాకుండా ప్రాథమికోన్నత స్థాయి నుంచి పాఠశాలను ప్రారంభించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి.












Click it and Unblock the Notifications