కొత్త రేషన్ కార్డుల జారీకి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి మరో కీలక ముందడుగు పడింది. కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీకి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛైర్మన్‌గా, దామోర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు.
ఇటీవల కేబినెట్ నిర్ణయం మేరకు సీఎస్ శాంతి కుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీకి అర్హతలు, విధి విధానాలను మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు చేయనుంది. రేషన్ కార్డుు, ఆరోగ్యశ్రీ కార్డులు వేర్వేరుగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. రేషన్ కార్డుల కోసం వార్షికాదాయం, భూ పరిమితి తదితర అంశాలపై సబ్ కమిట అధ్యయనం చేయనుంది.

ఆ నిర్ణయం సరైనదే: తెలంగాణ హైకోర్టు
భూదాన్ యజ్ఞ బోర్డును రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సబబేనంటూ తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. భూదాన్ బోర్డును రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని, దాన్ని ప్రశ్నించే చట్టబద్ధమైన హక్కు మాజీ ఛైర్మన్, సభ్యులకు లేదని తేల్చి చెప్పింది. భూదాన్ బోర్డు నిర్వహణ నిమిత్తం ప్రత్యేక అధికారిగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వు సబబేనని పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమంటూ ఛైర్మన్, సభ్యులు దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టివేసింది. భూదాన్ బోర్డును రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 59ను సవాలు చేస్తూ భూదాన్ యజ్ఞ బోర్డు ఛైర్మన్ జి.రాజేందర్ రెడ్డి, సభ్యులు సుబ్రమణ్యం తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సింగిల్ జడ్జి పిటిషన్ కొట్టివేయడంతో వారు అప్పీలు దాఖలు చేశారు.
అప్పీలుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె. శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. 2012లో ఉమ్మడి ఏపీలో భూదాన్ యజ్ఞ బోర్డు ఛైర్మన్ రాజేందర్ రెడ్డి, సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత భూదాన్ బోర్డును రద్దు చేస్తూ ప్రత్యేక అధికారిని నియమిస్తూ ప్రభుత్వం జీవో 11 జారీ చేసిందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications