Hyderabad: పోలీసు కస్టడీలో వ్యక్తి అనుమానాస్పద మృతి.. ఇది లాకప్ డెతేనా..!
దొంగతనం కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి పోలీసు కస్టడీలో మృతి చెందిన ఘటన హైదరాబాద్ లో సంచలనంగా మారింది. చిరంజీవి అనే వ్యక్తిని మంగళవారం సాయంత్రం దొంగతనం కేసులో పోలీసులు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. చిరంజీవి స్టేషన్ కు వెళ్లిన కొన్ని గంటల్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. చిరంజీవికి ఫిట్స్ వచ్చి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. కానీ పోలీసుల చిత్రహింసల వల్లే మృతి చెందాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు.
సికింద్రాబాద్ సింగరేణి కాలనీలో చిరంజీవి ఆటో నడుపుకుంటూ జీవిస్తుంటాడు. అయితే ఓ దొంగతనం కేసులో చిరంజీవిని తుకారాం గేట్ పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కొందరు పోలీసులు ఇంటికి వచ్చి దొంగతనం కేసుకు సంబంధించి విచారిస్తామని చెప్పి తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు తెలిపారు. చిరంజీవిని ఏ పోలీసు స్టేషన్ కు తీసుకెళ్తున్నారో పోలీసులు వెల్లడించలేదని చెప్పారు.

ఫిట్స్ కారణంగా చిరంజీవి కుప్పకూలి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు రాత్రి 10.30 గంటల ప్రాంతంలో పోలీసులు చిరంజీవి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అయితే అతడిని చిత్రహింసలకు గురిచేయడం వల్లే చనిపోయిందని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. మృతదేహం తల, ముఖం, అవయవాలపై గాయాల గుర్తులు ఉన్నాయని, పోలీసు కస్టడీలో అతను చిత్రహింసలకు స్పష్టంగా తెలుస్తోందని చెబుతున్నారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
జనవరి 29న మెదక్ లో ఖదీర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 2వ తేదీ వరకు పోలీస్ స్టేషన్ లోనే ఉంచి, ఆ తర్వాత అతని భార్యను పిలిపించి ఖదీర్‌ను ఆమెకు అప్పగించారు. ఆ తర్వాత ఖదీర్ అనారోగ్యం పాలవ్వడంతో మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కొంపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడ్నుంచి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఖదీర్ మృతి చెందాడు. దీంతో శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించి ఖదీర్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
మరణించే ముందు ఖదీర్.. తనను పోలీసులు తీవ్రంగా కొట్టారని చెప్పాడు. తాను దొంగతనం చేయలేదని చెప్పినా.. వినకుండా ఎస్ఐతోపాటు కానిస్టేబుళ్లు విచక్షణారహితంగా కొట్టారని చెప్పాడు. తాను ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన తర్వాత తనను విడిచిపెట్టారని వాంగ్మూలం ఇచ్చాడు. ఖదీర్ మరణంతో ఎస్ఐ రాజశేఖర్, ఇద్దరు కానిస్టేబుళ్లను క్రమశిక్షణ పరమైన చర్యలు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications