టెక్కీ భార్యను అత్యంత దారుణంగా హత్య చేసిన భర్త
హైదరాబాద్: నగరంలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు భర్త. బాచుపల్లిలో నివాసం ఉండే నాగేంద్ర భరద్వాజ తన భార్య మధులతను తలపై సుత్తెతో మోది, కత్తితో మెడపై పొడిచి చంపేశాడు.
అంతేగాక, ఆమెను కాలును నరికేసి.. ముక్కలు ముక్కలుగా కోసేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత గ్యాస్ లీకేజ్ చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. మే 4న చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, మృతురాలు మధులత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. నిందితుడైన నాగేంద్రని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.

కాగా, గత కొంత కాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిసింది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు నాగేంద్రను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. వరకట్న వేధింపుల వల్లే తమ కూతురిని అల్లుడు భరద్వాజ్ అత్యంత క్రూరంగా హత్య చేశాడని మధులత తల్లిదండ్రులు ఆరోపించారు.
డబ్బులు తెమ్మని తమ కూతురిని వేధించేవాడని, పలుమార్లు గొడవలు అయ్యాయని చెప్పారు. 2020లో వీరికి వివాహం జరిగిందని మధులత తల్లిదండ్రులు తెలిపారు. వీరికి ఏడాది బాబు ఉన్నాడు. తన కుమార్తెను భరద్వాజ్‌తో పాటు ఆమె అత్తమామలు కూడా కొట్టేవారని, తాము బాచుపల్లి పీఎస్‌లో కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురిని దారుణంగా హత్య చేసిన నాగేంద్రను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications