ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు సతీవియోగం: చంద్రబాబు సంతాపం
హైదరాబాద్: ప్రముఖ మీడియా హౌస్ ఏబీఎన్- ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణకు సతీ వియోగం కలిగింది. ఆయన భార్య వేమూరి కనకదుర్గ కన్నుమూశారు. ఆమె వయస్సు 62 సంవత్సరాలు. ఆమెకు కుమారుడు ఆదిత్య, కుమార్తె ఆమోద ఉన్నారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. అత్యాధునిక వైద్య సౌకర్యాన్ని అందించారు డాక్టర్లు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారు జామున ఆమె తుదిశ్వాస విడిచారు.
ఏబీఎన్-ఆంధ్రజ్యోతి గ్రూప్ సంస్థలకు చెందిన ఆమోద పబ్లికేషన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో వేమూరి కనకదుర్గ ఒకరు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మీడియా హౌస్ పురోగమించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. డైరెక్టర్‌గా సంస్థకు మార్గదర్శనం చేశారు. వేమూరి కనకదుర్గ భౌతికకాయానికి ఈ మధ్యాహ్నం అంత్యక్రియలను నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆమె మరణ వార్త తెలిసిన వెంటనే పలువురు రాజకీయ నాయకులు, టాలీవుడ్ ప్రముఖులు వేమూరి రాధాకృష్ణకు తమ సంతాపాన్ని తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు. ఓ మీడియా హౌస్‌ను విజయవంతంగా ముందుకు నడిపించిన మహిళాగా అభివర్ణిస్తున్నారు. ఆంధ్రజ్యోతి పురోభివృద్ధిలో ఆమె కీలక పాత్ర పోషించారని, సంస్థ డైరెక్టర్‌గా విలువైన సూచనలు ఇచ్చేవారని, మీడియా శక్తిని చాటి చెప్పారని పేర్కొంటున్నారు.
ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ సతీమణి వేమూరి కనకదుర్గ కన్నుమూత పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్‌గా కనకదుర్గ సంస్థ అభివృద్ధికి, ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేశారని పేర్కొన్నారు. ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఉద్యోగులను సొంత బిడ్డల్లా ఆమె చూసుకునేవారని తెలిపారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మనో ధైర్యం ఇవ్వాలని దేవున్ని ప్రార్ధిస్తున్నానని చంద్రబాబు నాయుడు అన్నారు.












Click it and Unblock the Notifications