అన్ని జిల్లా కేంద్రాల నుంచి ఏసీ బస్సులు: కొత్తగా 1500 ఆర్డర్
నల్గొండ: ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుతున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అంతేగాక, రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల నుంచి ఏసీ బస్సులను ప్రారంభిస్తామని చెప్పారు. నల్గొండ జిల్లాలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. అనంతరం కొత్తగా ఏర్పాటు చేసిన బస్సులను వారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన 48 గంటలలోనే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసినట్లు గుర్తు చేశారు. కొత్తగా 1000 బస్సులు కొనుగోలు చేశామన్నారు. మరో 1500 బస్సులకు ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపారు. నల్గొండ జిల్లాలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా బస్సుల సంఖ్య పెంచారని చెప్పారు. దసరాలోపు నల్గొండ జిల్లాకి 30 ఎక్స్‌ప్రెస్, 30 లగ్జరీ బస్సులు తీసుకువస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ఆర్టీసీ ఉద్యగుల సమస్యలను పరిష్కరిస్తున్నామని మంత్రి పొన్నం తెలిపారు. 21 శాతం డీఏ ఇచ్చామని, రూ.280 కోట్లు బకాయిల్లో రూ.80 కోట్లు చెల్లించామని చెప్పారు. మిగిలిన రూ.200 కోట్లను నెలాఖరులోగా చెల్లిస్తాం. 3,035 కొత్త ఉద్యోగాలకు నియామకాలు చేపట్టాం. నష్టాల్లో లేకుండా ఆర్టీసీని నడిపిస్తున్నామని మంత్రి పొన్నం వివరించారు. ప్రతి నియోజకవర్గం కేంద్రం నుంచి లగ్జరీ బస్సులు నడుపుతామన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల నుంచి ఏసీ బస్సులను ప్రారంభిస్తామని పొన్నం ప్రభాకర్ తెలిపారు.
అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిన విధంగా మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. నల్గొండలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కొత్త బస్సులు ఏర్పాటు చేశామన్నారు. రాజధాని నాన్ స్టాప్ ఏసీ బస్, మరో మూడు డీలక్స్ బస్సులను ప్రారంభించారని తెలిపారు. త్వరలో జిల్లాకు మరిన్ని కొత్త బస్సులు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. కొత్త బస్సుల్లో నల్గొండ జిల్లాకి 100 బస్సులను కేటాయించాలని పొన్నంను కోరారు.












Click it and Unblock the Notifications