రూ. కోటి విరాళం: నిజంగా దేవరే
Jr NTR: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దంచికొట్టిన అతి భారీ వర్షాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు దారుణంగా దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా ఉండట్లేదు. నదులు, చెరువులు ఏకం అయ్యాయి. జనావాసాలన్నీ జలమయం అయ్యాయి.
ఈ వాయుగుండం ప్రభావంతో తెలంగాణ ఉత్తర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. హైదరాబాద్ సహా నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, మంచిర్యాల్, హన్మకొండ, వరంగల్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి.

ఏపీలో కోస్తా తీర ప్రాంతాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ప్రత్యేకించి- రాజధాని అమరావతి మొత్తం నీట మునిగింది. విజయవాడలో ఇదే పరిస్థితి నెలకొంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో వరద ఉధృతి నెలకొంది. వేలాదిమందిని ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రదేశాలకు తరలించారు అధికారులు.
ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల కృష్ణానది ఉగ్రరూపాన్ని ధరించింది. వరద నీటితో పోటెత్తింది. బుడమేరుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. విజయవాడ, అమరావతి ప్రాంతాలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. సింగ్‌నగర్, చిట్టినగర్, సితార, రాజరాజేశ్వరి పేట, యనమలకుదురు, జక్కంపూడి వంటి ప్రాంతాలవాసులు వరద నీటిలో కాలం వెళ్లదీస్తోన్నారు.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని యంగ్ టైగర్ ఎన్టీఆర్.. రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళాన్ని ప్రకటించారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయల చొప్పున విరాళాన్ని ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ట్వీట్ పోస్ట్ చేశారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం తనను ఎంతగానో కలచివేసిందని జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అతి త్వరగా ఈ విపత్తు నుంచి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.
వరద విపత్తు నుండి ఉపశమనం పొందడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే సహాయక, పునరావాస చర్యలకు తనవంతుగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయల చొప్పున మొత్తాన్ని విరాళంగా ప్రకటిస్తున్నానని అన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.
— Jr NTR (@tarak9999) September 3, 2024
వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి…
ఎన్టీఆర్ నటిస్తోన్న తాజా చిత్రం.. దేవర. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. అతని సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్, షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్.. ఇతర కీలక పాత్రలను పోషించారు. కొరటాల శివ దర్శకుడు. యువ సుధ ఆర్ట్స్, హీరో నందమూరి కల్యాణ్ రామ్‌కు చెందిన ఎన్టీఆర్ ఆర్ట్స్.. సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తోన్నాయి.












Click it and Unblock the Notifications