నన్ను చంపాలని కుట్రలు: కాంగ్రెస్ నేతపై ఎమ్మెల్యే జోగు రామన్న సంచలన ఆరోపణలు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేత కంది శ్రీనివాస్ రెడ్డి తనను హత్య చేసేందుకు కుట్రలు చేస్తున్నారంటూ జోగు రామన్న సంచలన ఆరోపణలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కంది శ్రీనివాస్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.
ఎన్నారైనంటూ.. ఆదిలాబాద్‌ను ఉద్ధరించేందుకు వచ్చానంటూ చెప్పుకుంటున్న కంది శ్రీనివాస్ తనపై, తన కుటుంబంపై సంస్కారం, పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు ఎమ్మెల్యే జోగు రామన్న. తనను చంపించేందుకు తన చెంచాగాల్లతో కుట్రలు పన్నుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తనపై చేసిన అవినీతి ఆరోపణలను ఎమ్మల్యే జోగు రామన్న కొట్టిపారేశారు. తాను అవినీతి చేశానని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. ఉన్నత చదువులు చదవిన వ్యక్తికి ఉండాల్సిన సంస్కారం, మర్యాద లేకుండా కంది శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేవలం జోగు రామన్నను వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా మాట్లాడితే పెద్ద నాయకుడివి అవుతా.. టికెట్ వస్తుంది అనే ఉద్దేశంతో ఊహించుకుంటే నష్టం తప్ప నీకు లాభం ఉండదని జోగు రామన్న.. కందికి సూచించారు.
కంది శ్రీనివాస్ చేసిన అవినీతి ఆరోపణలపై చట్టపరంగా ముందుకెళ్తానని.. ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని జోగు రామన్న స్పష్టం చేశారు. టికెట్ రాకపోతే అమెరికా పారిపోయే నీకు ఆదిలాబాద్ ప్రజల ఆశీస్సులు దక్కేది లేదని జోగు రామన్న ఎద్దేవా చేశారు. కాగా, బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కంది శ్రీనివాస్ రెడ్డి ఆదిలాబాద్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థిపై విమర్శలు గుప్పిస్తున్నట్లు తెలుస్తోంది. పలు కార్యక్రమాలతో నియోజకవర్గంలో శ్రీనివాస్ ఇప్పటికే తన ప్రచారాన్ని ప్రారంభించారు.












Click it and Unblock the Notifications