కోడలు, మనవళ్ల అనుమానాస్పద మృతి: రాజయ్య, ఫ్యామిలి అరెస్ట్, ఎవరైనా వదలం: ఐజీ
వరంగల్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లల మృతి నేపథ్యంలో విచారణ జరుగుతోందని, రాజయ్య కుటుంబ సభ్యుల పైన ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ఐజీ నవీన్ చంద్ బుధవారం నాడు స్పష్టం చేశారు. నిందితులపై అప్పుడే నిర్ధారణకురాలేమన్నారు.
సారిక, ముగ్గురు పిల్లల మృతి నేపథ్యంలో అనుమానితులను అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. సారికది హత్యనా లేక ఆత్మహత్యనా అనే విషయం విచారణలో తేలుతుందని చెప్పారు. క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోందన్నారు. ఎవరు దోషులుగా తేలినా వదిలేది లేదన్నారు.
సారిక పడక గదిలో గ్యాస్ సిలిండర్ లభ్యమయిందని చెప్పారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు ఘటన జరిగిందని, ఈ ఘటనతో సంబంధం ఉన్నవాళ్లపై చర్యలు తప్పవన్నారు.
సారిక అమ్మ, చిన్నమ్మ ఘటనాస్థలికి వచ్చారని, పోస్టుమార్టం తర్వాత సారిక మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు. ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారన్నారు. కేసు దర్యాఫ్తు దశలో ఉందన్నారు. ఐజీ నవీన్ చంద్... సిపి సుధీర్ బాబును వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పోలీసుల అదుపులో రాజయ్య కుటుంబ సభ్యులు
పోలీసులు రాజయ్య కుటుంబ సభ్యులను బుధవారం నాడు అదుపులోకి తీసుకున్నారు. కోడలు సారిక, ముగ్గురు చిన్నారుల మృతిపై వారిని విచారించనున్నారు. ఈ నేపథ్యంలో రాజయ్య ఇంటి వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో రాజయ్య, భార్య మాధవి, రాజయ్య కొడుకు అనిల్ ఉన్నారు. వారిని పోలీసులు అరెస్టు చేసినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు.

రాజయ్య నివాసానికి సారిక కుటుంబం, పోలీసు అధికారులు
సారిక, ముగ్గురు పిల్లల మృతి నేపథ్యంలో సారిక తల్లి లలిత, సోదరిలు బుధవారం మధ్యాహ్నం రాజయ్య ఇంటికి చేరుకున్నారు. మరోవైపు ఘటన పైన పూర్తిస్థాయి విచారణ జరిపేందుకు ఐజీ నవీన్ చంద్, డిఐజి మల్లారెడ్డి, ఎస్పీ అంబర్ కిషోర్ ఝా సంఘటన స్థలానికి చేరుకున్నారు.
రాజయ్యకు నేతల పరామర్శ
రాజయ్యను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పరామర్శించారు. మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, వివేక్, మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ పరామర్శించారు.
రాజయ్యను అరెస్టు చేయాలి
రాజయ్యను, కుటుంబ సభ్యులను అరెస్టు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లల మృతిపై మహిళా సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. రాజయ్య కుటుంబ సభ్యులే సారిక ప్రాణాలు తీసుకున్నారని సారిక తల్లి ఆరోపిస్తున్నారు.
బుధవారం తెల్లవారుజామున సంఘటన జరిగితే పోలీసులు ఇంకా నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని మహిళా సంఘాలు ప్రశ్నించాయి. సామాన్యులెవరికైనా ఇలాంటి ఘటన జరిగితే ఇప్పటికే సంబంధిత కుటుంబ సభ్యులందరినీ అరెస్టు చేసేవాళ్లని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications